మరో రెండు నెలలో ఏపీలో జరగబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఎంపీ అభ్యర్థుల ఎంపిక పెద్ద తలనొప్పిగా మారబోతోంది. అధ్యక్షుడు చంద్రబాబు సభలు సమావేశాలు నిర్వహిస్తూ దూకుడు చూపిస్తున్న.. క్షేత్రస్తాయిలో మాత్రం పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. టీడీపీకి ఉన్న ముగ్గురు ఎంపీలూ తలోదారిలో ఉన్నారు. ఇప్పటికే విజయవాడ ఎంపీ కేశినేని నాని పార్టీకి, పదవికి రాజీనామా చేయబోతున్నట్టు ప్రకటించారు. ఇక గుంటూరు ఎంపీగా ఉన్న జయదేవ్ చాలా కాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఆయన ఈసారి పోటీ చేయలేనని అధిష్టానానికి తేల్చి చెప్పినట్టుగా తెలుస్తుంది. అటు శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు ఈసారి అసెంబ్లీకి పోటీ చేయాలని భావిస్తున్నారు. సిట్టింగ్ ఎంపీలే ఇలా పోటీకి ఆసక్తి చూపకపోవడంతో అంతా గందరగోళంగా మారిపోయింది.
ఇక మిగిలిన ఎంపీ నియోజకవర్గాల పరిస్థితి కూడా అలాగే ఉంది. అక్కడ కూడా పోటీ చేసేందుకు నాయకులు ఎవరూ ముందుకు రావడం లేదు అని టాక్. ఎంపీగా పోటీ చేసే వారికి చంద్రబాబు పెడుతున్న టార్గెట్లు కూడా ఎక్కవగా ఉన్నాయట. నేతలు పోటీకి దూరంగా ఉండానికి ఇదీ ఒక కారణమన్న ప్రచారం ఉంది. రాయలసీమలో తిరుపతి స్థానం నుంచి పోటీలో ఉండే సినీనటుడు శివప్రసాద్ మరణంతో అక్కడ పార్టీకి సరైన అభ్యర్థి ఇప్పటికీ దొరకడం లేదు. చంద్రబాబు సొంత జిల్లా అయిన చిత్తూరు ఎంపీ స్థానానికి కూడా అభ్యర్థి దొరకని పరిస్థితి ఉంది. కర్నూలు నుంచి గత ఎన్నికల్లో కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి పోటీ చేశారు. కానీ ఈసారి ఆయన ఎంపీగా పోటీ చేసేందుకు ఆసక్తి కనబరచడం లేదని సమాచారం.
నరసరావుపేట నుంచి పోటీ చేసిన రాయపాటి కూడా ఇప్పుడు పార్టీకే దూరంగా ఉంటున్నారు. బాపట్లలో పోటీ చేసిన మాల్యాద్రి శ్రీరామ్ పరిస్థితి కూడా అంతే. కడపలోనూ టీడీపీ తరుపున పోటీ చేసే అభ్యర్థి దొరకడం లేదు. ఇలా 25 నియోజకవర్గాల్లో సగానికిపైగా స్థానాల్లో ఎంపీ అభ్యర్థులు దొరకడం లేదు అని చంద్రబాబు మధనపడిపోతున్నారట.