ఈసారి తెలంగాణ ఎన్నికలు అధికార బీఆర్ఎస్ పార్టీకి చాలా కీలకంగా మారాయి. గత పదేళ్ల పరిస్థితులు వేరు.. ఇప్పటి పరిస్థితి వేరు. పదేళ్లలో ఎన్నడూ లేనంత స్థాయిలో గులాబీ బాస్ కేసీఆర్ పాలనపై వ్యతిరేకత వచ్చింది. అది చాలదన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ బాగా పుంజుకుంది. బీఆర్ఎస్ పార్టీకే సవాల్ విసురుతోంది. ఇక బీజేపీ కూడా ఈ ఎన్నికలను సవాల్‌గా తీసుకుంది. దీంతో బీఆర్ఎస్‌కు అన్ని వైపులా ఇబ్బందికర పరిస్థితులు అయితే తలెత్తాయి. ఇది చాలదన్నట్టుగా ఆ పార్టీకి ఎన్నికల అఫిడవిట్లు తలనొప్పిగా తయారయ్యాయి. అసలు ఎన్నికల అఫిడవిట్ల విషయంలో బీఆర్ఎస్ ముందుగానే ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఓ కమిటీని ఏర్పాటు చేసుకుంది.
కమిటీని ఏర్పాటు చేసిన బీఆర్ఎస్..
ఈ కమిటీ పనేంటంటే.. ఎమ్మెల్యే అభ్యర్థుల అఫిడవిట్‌లను చాలా జాగ్రత్తగా నింపడం. గత ఎన్నికల్లో అభ్యర్థులు నింపిన అఫిడవిట్‌లపై కేసులు నమోదయ్యాయి. ఇప్పటికీ కొందరివి కోర్టుల్లో ఉన్నాయి. ఈసారి ఆ తప్పులు జరగకూడదంటూ సీఎం కేసీఆర్ బీఫాంలు ఇచ్చిన రోజే అభ్యర్థులకు చాలా క్లియర్‌గా చెప్పారు. ప్రత్యేకంగా లాయర్లతో ఓ కమిటీని ఏర్పాటు చేశామని వారి సాయంతో అఫిడవిట్‌ను నింపాలని సూచించారు. అయినా కూడా బీఆర్ఎస్ నేతలపై దెబ్బ పడుతూనే ఉంది. బీఆర్ఎస్ నేతల మీద అఫిడవిట్లపై వరుస ఫిర్యాదులు ఎన్నికల కమిషన్‌కు అందుతోంది. గత ఎన్నికల్లో కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఇచ్చిన తప్పుడు అఫిడవిట్ రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.
నామినేషన్ రద్దు చేయాలంటూ ఫిర్యాదు..
ఇప్పుడు కూడా అఫిడవిట్‌లో వనమా ఆ కేసు వివరాలు మెన్షన్ చేయలేదంటూ మరోసారి ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. ఇక ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ తరుఫున గెలిచే అవకాశమున్న ఒకే ఒక్క నేత మంత్రి పువ్వాడ అజయ్. ఆయన అఫిడవిట్ సైతం ప్యాట్రన్ ప్రకారం లేదని.. వెంటనే నామినేషన్ రద్దు చేయాలంటూ జలగం వెంకట్రావు ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేయడం కలకలం రేపుతోంది. మరోవైపు అలంపూర్ బీఆర్‌ఎస్ అభ్యర్థి విజయుడు ప్రభుత్వ ఉద్యోగంలో ఉంటూ ఎమ్మెల్యేగా నామినేషన్ వేశారంటూ కాంగ్రెస్, బీఎస్పీలు ఆందోళనకు దిగాయి. ఇది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. విజయుడు తన ఉద్యోగానికి రాజీనామా చేసినట్టు ఎక్కడా ఆధారాలు లేవని గట్టిగా కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. కాబట్టి ఆయన నామినేషన్‌ను రద్దు చేయాలని ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు. మొత్తానికి ఎన్నికల సమయంలో అఫిడవిట్లు బీఆర్ఎస్‌కు తలనొప్పిగా మారాయి.