Advertisement

కేసీఆర్ Vs ఈటల.. గజ్వేల్‌లో గెలిచేదెవరు?


కేసీఆర్ Vs ఈటల రాజేందర్ 

Advertisement

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయ్.. అధికార బీఆర్ఎస్,  ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీ పార్టీలో ఎన్నికల ప్రచారంలో జోరు పెంచాయి. అలివిగాని హామీలిస్తూ జనాల్లోకి వెళ్తున్నాయ్ రాజకీయ పార్టీలు. ఎట్టి పరిస్థితుల్లో హ్యాట్రిక్ కొట్టి తీరాల్సిందేనని బీఆర్ఎస్.. మూడోసారి కేసీఆర్‌ను సీఎం సీటును టచ్ కూడా చేయనివ్వమని ప్రతిపక్ష పార్టీలు శపథం చేస్తున్నాయి. మరోవైపు.. రోజుకో సర్వే సంస్థ చిత్రవిచిత్రాలుగా ఒపీనియన్ పోల్స్ రిలీజ్ చేస్తోంది. దీంతో రాష్ట్రంలో పొలిటికల్ హీట్ అమాంతం పెరిగిపోయింది. ఇక అసలు విషయానికొస్తే.. తెలంగాణలో 119 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నప్పటికీ అందరి చూపు.. సీఎం కేసీఆర్ పోటీచేస్తున్న గజ్వేల్, కామారెడ్డి స్థానాలవైపే ఉంది. ఎందుకంటే.. గులాబీ బాస్ నమ్మకం లేకనో లేకుంటే వ్యూహాత్మకంగా చేస్తున్నారో తెలియట్లేదు కానీ.. రెండు స్థానాల నుంచి బరిలోకి దిగుతున్నారు. ఇక ఈయనపై గజ్వేల్ నుంచి.. ఒకప్పుడు బీఆర్ఎస్ పార్టీలో నంబర్-02 చక్రం తిప్పి.. ఇప్పుడు బీజేపీలో ఉన్న సీనియర్ నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్ పోటీ చేస్తున్నారు. ఒకప్పుడు ఈ ఇద్దరూ ఆప్త మిత్రులే.. కొన్ని అనివార్య కారణాల వల్ల ప్రత్యర్థులయ్యారు.. ఇప్పుడు ఎన్నికల కదనరంగంలో నువ్వా-నేనా అంటూ తేల్చుకోబోతున్నారు.

ఇదీ ఈటల సత్తా..!

ఈటల గురించి తెలంగాణ ప్రజలకు ప్రత్యేకించి పరిచయం చేయనక్కర్లేదు. మలి దశ ఉద్యమం నుంచి చురుక్కా పాల్గొన్నారు. జయశంకర్ ఆదేశాలతో పెట్టిన తెలంగాణ రాష్ట్ర సమితిలో కేసీఆర్‌తో కలిసి పని చేశారు. స్వరాష్ట్ర సాధనకు అలుపెరగని పోరాటం చేశారాయన. ప్రత్యేక తెలంగాణ వచ్చిన తర్వాత రెండు సార్లు మంత్రి పదవులు అనుభవించారు. కొవిడ్ సమయంలో మొత్తం రాష్ట్రంలో ఒక్క ఈటల మాత్రమే పర్యటిస్తూ అందరినీ ఆకట్టుకుని.. నిజమైన నాయకుడు అని నిరూపించుకున్నారు. అయితే.. ఆ తర్వాత అవినీతి ఆరోపణలు అంటగట్టడం.. పార్టీలో నంబర్-02గా ఉండటంతో రేపొద్దున ఎక్కడ తనకు అసలుకే ఎసరు తెస్తాడేమోనని.. పొగబెట్టి మరీ బయటికి పంపారన్నది జగమెరిగిన సత్యమే.అలా బయటికెళ్లి బీజేపీలో చేరి.. తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి హుజురాబాద్ నుంచి పోటీచేసి భారీ మెజారిటీతో గెలిచి నిలిచారు. అయితే ఈట దమ్మేంటో చూసిన బీజేపీ.. పశ్చిమ బెంగాల్ ఫార్ములాను తెలంగాణలోనూ ప్రయోగించింది. బెంగాల్‌లో టీఎంసీ అధినేత్రి, సీఎం మమతా బెనర్జీని దెబ్బ కొట్టేందుకు బీజేపీ వ్యూహాత్మకంగా.. టీఎంసీకి టాటా చెప్పి కమలం కండువా కప్పుకున్న సువేందు అధికారిని దీదీపై పోటీకి నిలిపింది. మమతపై సువేందుకు విజయం సాధించగా.. ఆరు నెలలలోపు మళ్లీ మరో అసెంబ్లీ స్థానం నుంచి పోటీచేయడంతో ముచ్చటగా మూడోసారి అధికారం చేపట్టారు దీదీ. ఇప్పుడు ఇదే ఫార్ములాను తెలంగాణలో వాడుతోంది హైకమాండ్.

ఈటలకే ఛాన్స్!

కేసీఆర్‌లాగే ఈటల కూడా గజ్వేల్‌తోపాటు తన సొంత నియోజకవర్గం హుజురాబాద్ నుంచి కూడా పోటీచేస్తున్నారు. మొదట్నుంచీ బీఆర్ఎస్ అధినేతకు కంచుకోటగా ఉన్న గజ్వేల్‌లో ఓడించాలని రాజేందర్ కంకణం కట్టుకున్నారు. అనుకున్నట్లుగానే గజ్వేల్ అభ్యర్థిగా బీజేపీ హైకమాండ్‌ ఈటలను బరిలోకి దింపింది. ఇక్కడ్నుంచి కచ్చితంగా గెలుస్తాననే ధీమాతోనే బీజేపీ అభ్యర్థి ఉన్నారు. ఎందుకంటే.. నియోజకవర్గంలో సామాజిక సమీకరణాలను ఈటల గట్టిగానే విశ్వసిస్తున్నారు. ముదిరాజ్ సహా బీసీ సెక్షన్ల ప్రజలు మద్దతుపై ఆయన గంపెడు ఆశలు పెట్టుకున్నారు. ఈ సామాజికవర్గాలు కూడా ఓపెన్‌గా రాజేందర్‌కే తమ మద్ధతు అన్నట్లు ప్రకటించేశాయి కూడా. అభ్యర్థులు ఎంపికలో బీఆర్ఎస్.. బీసీ వ్యతిరేకిగా ముద్ర వేసుకున్నారని పెద్దలు తిట్టిపోస్తున్నారు. మరోవైపు ముదిరాజ్ సామాజిక వర్గానికి ఒక్క సీటు కూడా ఇవ్వలేదు. దీంతో ముదిరాజ్ సామాజిక వర్గ ఓట్లన్నీ గంపగుత్తుగా తనకే పడతాయని రాజేందర్ ఆశలు పెట్టుకున్నారు. కేసీఆర్‌కు బీసీ వ్యతిరేకిగా ముద్రపడిపోయిందనే చర్చ జోరుగానే జరుగుతోంది. ఒకవేళ బీజేపీ అనుకున్నట్లు జరిగితే.. బీసీ ట్యాగ్‌పై ఈజీగా ఈటల గెలిచేయచ్చట. రాజేందర్‌కు రాష్ట్ర వ్యాప్తంగా బాగా ఆదరణ ఉంది. వివాదాలకు జోలికి వెళ్లని నేతగా.. సౌమ్యుడిగా కూడా గుర్తింపు ఉంది. గెలిస్తే మంచి మెజార్టీతో ఈటల గెలవచ్చు లేకుంటే.. కేసీఆర్ మెజార్టీకి భారీగానే తూట్లు పొడవచ్చని రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మాట. మొత్తానికి చూస్తే ఫైట్ బాగా టఫ్‌గానే ఉంటుందన్నది మాత్రం స్పష్టంగా అర్థమవుతోంది. ఫైనల్‌గా గజ్వేల్.. ఈటల వైపు ఉందా.. లేకుంటే కేసీఆర్‌ కారు గుర్తుకే ఓటేసి గెలిపించుకుంటుందా అనేది తెలియాల్సి ఉంది మరి.

Gajwel: KCR Vs Etala.. Who will win?:

Kcr Vs Etela : Who will win in Gajwel constituency..?
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement