నందమూరి కుటుంబంలో పురందేశ్వరి దంపతులు తప్ప దాదాపు అంతా కూడా టీడీపీకి అండగానే ఉన్నారు. అంతెందుకు ఇటీవల టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర కోసం చాలా యాక్టివ్‌గా పని చేసి గుండెపోటుతో మరణించిన తారక్ రత్న భార్య కూడా తాము టీడీపీ అధినేత చంద్రబాబుకు మద్దతుగానే ఉంటామని తేల్చి చెప్పేశారు. అలాంటిది జూనియర్ ఎన్టీఆర్‌కు ఏమైంది? మరీ ముఖ్యంగా ఇటీవలి కాలంలో ఎన్టీఆర్ వ్యవహరిస్తున్న శైలి.. ప్రవర్తిస్తున్న తీరు.. ఎన్టీఆర్ కుటుంబానికి.. టీడీపీ కార్యకర్తలకు కొంత ఇబ్బందికరంగా ఉన్న విషయం తెలిసిందే.
ఇతనింతే అని నిర్ణయానికి వచ్చేశారా?
చంద్రబాబు నాయుడి సతీమణిని అంటే స్వయంగా ఎన్టీఆర్ మేనత్తను అసెంబ్లీలో తనకు అనుంగులుగా ఉన్న వల్లభనేని వంశీ, కొడాలి నానిలు నోటికొచ్చినట్టు మాట్లాడిన సందర్భంలో ఎన్టీఆర్ ప్రవర్తన విచిత్రంగా అనిపించింది. అంతకు ముందు కూడా పార్టీకి, కుటుంబానికి సంబంధించిన ప్రవర్తిన తీరు అతని పట్ల కుటుంబ సభ్యులు వ్యతిరేక భావనను పెంచుకోవడానికి దోహదపడింది. ఇక ఇప్పుడు చంద్రబాబు అరెస్ట్ తర్వాత పట్టించుకోకపోవడం కనీసం.. మాట మాత్రం స్పందించకపోవడం.. ఎందుకు జరిగిందనేది కూడా ఆరా తీయకపోవడం పట్ల ఎన్టీఆర్ కుటుంబం ఆశ్చర్యపోలేదు. పైగా ఇతనింతే అనే నిర్ణయానికి వచ్చినట్టుగా నిన్న నందమూరి బాలకృష్ణ చెప్పిన సమాధానంతో మరింత క్లారిటీ వచ్చింది.
ఎన్టీఆర్ రాకుంటే పార్టీ కుప్పకూలుతుందా?
ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో బాలకృష్ణ టీడీపీ కార్యకర్తలతో ఒక మీటింగ్‌లో పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఏపీలో ఇంత జరుగుతున్నా జూనియర్ ఎన్టీఆర్ స్పందించకపోవడంపై బాలయ్య మాట్లాడుతూ.. జూనియర్ ఎన్టీఆర్ స్పందించకున్నా లేకపోతే సినిమా జనాలు రియాక్ట్ కాకపోయినా ఐ డోంట్ కేర్ అంటూ బాలయ్య అని చెప్పారు. అప్పటి నుంచి బాలయ్య వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. నిజమే మరి.. ఎన్టీఆర్ వస్తేనే పార్టీ నిలబడుతుంది.. లేదంటే కుప్పకూలిపోతుంది అన్న ఆందోళన అయితే టీడీపీలో ఇప్పటి వరకూ లేదు. ఇక మీద కూడా ఉండదు. పైగా ఎన్టీఆర్ వైఖరి ఇంత ఇబ్బందికరంగా ఉన్నప్పుడు అసలు ఆయనను పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం పార్టీకి ఏముందనేది కార్యకర్తల్లో జరుగుతున్న చర్చ.
పార్టీకేమైనా పిల్లరా?
పార్టీని ప్రారంభించినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ పుట్టను కూడా లేదు. పోనీ ఏ సంక్షోభ సమయంలోనూ పార్టీకి పిల్లర్‌లా మారిందీ లేదు. అలాంటప్పుడు అసలు ఎన్టీఆర్‌ను పరిగణలోకి తీసుకుని ఆయనేదో స్పందించలేదు అనుకోవాల్సిన అవసరం ఏముంది? పోనీ స్పందించాడే అనుకుందాం. జరిగిన పరిణామాలన్నీ ఒక్కసారిగా సెట్ రైట్ అయిపోతాయా? అదీ లేదుగా. కాబట్టి బాలయ్య అయితే పర్ఫెక్ట్ సమాధానం చెప్పారని టీడీపీ అభిమానులు భావిస్తున్నారు. నిజానికి ఎన్టీఆర్ స్పందిస్తే ఎంత.. స్పందించకుంటే ఎంత? ఐ డోంట్ కేర్ అని నేరుగానే బాలయ్య చెప్పారు. ఇంతకు మించిన సమాధానం ఏం కావాలి? ఈ సమాధానం విన్న తర్వాత ఇక కార్యకర్తలు సైతం ఇదే భావనతో ముందుకు వెళ్లే అవకాశం ఉంది. కార్యకర్తలు సైతం ఇక మీదట ఎన్టీఆర్‌ను లైట్ తీసుకుంటారనడంలో సందేహమే లేదు.