లండన్ నుంచి వచ్చీ రాగానే ఏపీ సీఎం జగన్ ఢిల్లీ వెళతారని ఆ పార్టీ పెద్దలు చెప్పుకొచ్చారు. కానీ ఆయన వెళ్లలేదు. అప్పటి పరిణామాలకు అనుగుణంగా బీజేపీ అధిష్టానం సైతం నడుచుకుందనే టాక్ నడిచింది. జగన్‌కు అపాయింట్‌మెంట్ ఇస్తే టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ వెనుక తామున్నామనే అపోహలు తలెత్తుతాయి. వాటికి అవకాశం ఇవ్వకూడదనే ప్రధాని మోదీ కానీ అమిత్ షా కానీ అపాయింట్‌మెంట్ ఇవ్వలేదని ప్రచారం జరిగింది. ఇక నేడు జగన్ ఢిల్లీ వెళ్లబోతున్నారు. మోదీ, అమిత్‌షాలను కలిసేందుకు వెళుతున్నారు. అలాగే ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్, జల్‌శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్‌దీప్ సింగ్ పురి సహా పలువురు నాయకులను కలిసే అవకాశం ఉంది.
వీరందరినీ పక్కనబెడితే జగన్ ఢిల్లీ టూర్, ప్రధాని, అమిత్ షాలతో బేటీ అంశాలు ఏపీలో హాట్ టాపిక్‌గా మారాయి. నిజానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్.. టీడీపీతో పొత్తు ప్రకటించనప్పుడు బీజేపీ కూడా తమతో కలిసి వస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. కానీ చంద్రబాబు అరెస్ట్ మొదలు పొత్తు వరకూ ఏ అంశంపై బీజేపీ అధిష్టానం పెదవి విప్పింది లేదు. మరి ఇలాంటి తరుణంలో జగన్‌కు అపాయింట్‌మెంట్ ఇవ్వడం వెనుక అంతరార్థం ఏంటనేది ఆసక్తికరంగా మారింది. చంద్రబాబు అరెస్ట్‌లో బీజేపీ హస్తం నిజంగానే ఉందా? వచ్చే ఎన్నికల్లో వైసీపీకి అండగా బీజేపీ నిలవబోతుందా? అనే అంశాలు ఏపీలో చర్చనీయాంశంగా మారాయి. ఇప్పటి వరకూ జగన్‌కు బీజేపీ అధిష్టానం ఆర్థికంగానే కాదు.. కేసుల విషయంలోనూ అండగా నిలిచింది.
ఇప్పుడు జగన్ పగకు సైతం బీజేపీ తోడుగా నిలుస్తోందని టాక్. లేదంటే ఇన్ని రోజులు అవుతున్నా కనీసం బీజేపీ చంద్రబాబు అరెస్ట్‌పై పెదవి విప్పలేదు. అలాగే పొత్తు అంశంపై కూడా పెదవి విప్పలేదు. అంటే జగన్‌కు మద్దతుగా బీజేపీ నిలుస్తోందనేగా దాని అర్థమని తెలుగు తమ్ముళ్లు అంటున్నారు. నిజానికి ఈ విషయం బీజేపీ రాష్ట్ర నాయకత్వానికి కూడా తెలిసి ఉండకపోవచ్చని అంటున్నారు. ఇక ఢిల్లీలో జనసేన-టీడీపీతో పొత్తుతో పాటు తాను పొలిటికల్‌గా తీసుకుంటున్న నిర్ణయాలకు ప్రధాని మోదీని జగన్ మద్దతు కోరే అవకాశం ఉందని అంటున్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులను సైతం అరెస్ట్ చేయించాలని జగన్ భావిస్తున్నట్టు సమాచారం. మొత్తానికి జనసేను సైతం వైసీపీ పక్కనబెట్టి వైసీపీతో బీజేపీ అంటకాగుతోందని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.