నిన్న మీసం.. ఇవాళ విజిల్..
టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ తరువాత ఆయన తనయుడు, టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఒంటరిగా పార్టీని ముందుకు నడిపించగలరా? లేదా? అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. ఆ సమయంలోనే అల్లుడికి అండగా.. నందమూరి బాలకృష్ణ రంగంలోకి దిగారు. అప్పటి వరకూ రాజకీయాల్లో ఉన్నామా? లేమా? అన్నట్టుగా ఉన్న బాలయ్య ఒక్కసారిగా యాక్టివ్ అయిపోయారు. నారా లోకేష్ ఢిల్లీకి వెళ్లి అక్కడ పనులు చక్కబెడుతుంటే ఏపీలో బాలయ్య పార్టీని ఫుల్ జోష్‌తో నడిపిస్తున్నారు. ఇక ఏపీ అసెంబ్లీలో బాలయ్యను ఈ విధంగా మనం ఎప్పుడూ చూడలేదు. నిన్నటికి నిన్న ఏపీ అసెంబ్లీలో మీసం తిప్పి హంగామా చేశారు. ఇక నేడు విజిల్ ఊది వైసీపీ నేతలకు చుక్కలు చూపించారు.
స్లోగన్స్.. విజల్ ఊదటం..
గతంలో అవసరం అయినప్పుడు తప్పితే బాలయ్య సభకు వచ్చేవారు కాదు. చంద్రబాబు అరెస్ట్ తర్వాత ఇక పార్టీని ఆయన తన భుజస్కందాలపై వేసుకున్నారు. ఆందోళనల్లో పాల్గొంటున్నారు. అసెంబ్లీలో అయితే స్పీకర్ పోడియం దగ్గరకు వెళ్లి మరీ తన నిరసన తెలియజేస్తున్నారు. అధికార పక్షానికి వ్యతిరేకంగా స్లోగన్స్.. మీసాలు మెలేయడం.. తొడ కొట్టడం.. విజిల్ ఊదడం వంటి చేస్తూ అసెంబ్లీని షేక్ చేస్తున్నారు. బాలయ్యే ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్. అధికార పక్షం.. విపక్షం అన్న తేడా లేకుండా ఆయన గురించి చర్చించుకుంటున్నారు. నిన్న, ఇవాళ చూస్తే అధికారపక్షం నేతలంతా కేవలం బాలయ్యనే టార్గెట్ చేస్తుండటం గమనార్హం. కనీసం బాలకృష్ణ పేరు ఎత్తకుండా మాట్లాడడం లేదంటే అతిశయోక్తి కాదు.
మీడియా పాయింట్‌లో కూడా బాలకృష్ణ గురించే..
నిన్నటికి నిన్న మంత్రి అంబటి రాంబాబు నుంచి ప్రతి ఒక్కరూ బాలకృష్ణను టార్గెట్ చేశారు. మీసాలు తిప్పడం వంటివి సినిమాల్లో చేసుకోవాలంటూ బాలకృష్ణపై మంత్రి అంబటి రాంబాబు ఫైర్ అయ్యారు. రారా చూసుకుందాం అంటూ అంబటికి సవాల్ విసిరారు. ఇక నేడు కూడా ఇదే వరుస. మంత్రి కాకాణి గోవర్ధన్ నుంచి ఎమ్మెల్యే బియ్యపు మధుసూధన్ రెడ్డి వరకూ బాలకృష్ణనే టార్గెట్ చేశారు. అంతేకాదు.. చివరికి మీడియా పాయింట్‌లో కూడా ఎక్కడ చూసినా బాలకృష్ణ గురించే చర్చ జరుగుతోంది. తెలుగుదేశం అధినేత చంద్రబాబుపై పెట్టిన కేసు అక్రమమని, దీనిపై పోరాటం ఆపేది లేదని బాలకృష్ణ ప్రెస్ మీట్ పెట్టి మరీ స్పష్టం చేశారు. మంద బలంతో విర్రవీగుతున్న వైకాపా ఎమ్మెల్యేలకు తగిన మూల్యం తప్పదంటూ హెచ్చరికలు జారీ చేశారు. ఒక్కసారిగా బాలకృష్ణ స్వపక్షం, అధికార పక్షం, సామాన్య ప్రజానీకంలో హాట్ టాపిక్ అయ్యారు.