గత నాలుగేళ్లుగా ఆంధ్రప్రదేశ్ లో ఏ ఎన్నికలు జరిగినా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏకపక్ష విజయాలను సొంతం చేసుకోవడం చూస్తూనే ఉన్నాం. గత సార్వత్రిక ఎన్నికల్లో 151 శాసనసభ , 22 లోక్ సభ స్థానాలు సాధించిన వైఎస్సార్ కాంగ్రెస్ ఆ తరువాత జరిగిన మున్సిపల్, పంచాయతీ, జిల్లాపరిషత్, సహకార సంఘాల ఎన్నికల్లో అదే జోరును చూపిస్తూ వస్తోంది. ప్రత్యర్థి పార్టీ అయిన తెలుగుదేశం ఏ విషయంలోనూ పోటీ ఇవ్వలేక చేతులెత్తేస్తోంది.
శనివారం జరిగిన గ్రామ పంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యుల ఉప ఎన్నికల్లోనూ ఫ్యాన్ జోరు స్పష్టంగా కనిపించింది. ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత ఉంది, ఈసారి మేం అధికారంలోకి రావడం ఖరారైంది అని చెప్పుకున్న ప్రతిపక్షాలు బలపరిచిన అభ్యర్థులు ఈ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయారు. రాష్ట్ర వ్యాప్తంగా 66 సర్పంచు పదవులకు ఎన్నికలు జరిగితే అందులో 53 స్థానాలు వైసీపీ గెలుచుకోగా పది చోట్ల టీడీపీ ఒకచోట జనసేన అభ్యర్థి విజయం సాధించారు. ఇక 1062 వార్డు సభ్యుల పదవులకు ఎన్నికలు జరిగితే ఏకగ్రీవాలతో కలిసి 810 స్థానాల్లో వైసీపీ బలపరిచిన విజయం సాధించగా తెలుగుదేశం 182 స్థానాల్లో, జనసేన ఏడు చోట్ల గెలిచాయి.
చంద్రబాబు ఆయన బావమరిది బాలయ్యబాబు ఇలాకాలో సైతం ఫ్యాను గాలి వీచింది.
ఇక చంద్రబాబు సారధ్యం వహిస్తున్న కుప్పంలో ఆరు వార్డు సభ్యుల పదవులకు ఎన్నికలు జరిగితే చంద్రబాబు ఇప్పుడు ఇల్లు నిర్మిస్తున్న శాంతిపురం మండలం, శివపురం వార్డ్ సైతం వైసిపి ఖాతాలోకి వెళ్ళింది. బాలయ్యబాబు ఎమ్మెల్యేగా ఉన్న హిందూపురంలో సైతం చలివెందుల పంచాయతీ సర్పంచ్ స్థానం వైసీపీ ఎగరేసుకుపోయింది. దీంతో తెలుగు దేవం అసలు గల్లంతయ్యాయి.
మరోవైపు ఉపఎన్నికలు జరిగిన అన్ని జిల్లాల్లోనూ వైఎస్సార్ కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యాన్ని చూపింది. ఆ జిల్లా ఈ జిల్లా ఆ ప్రాంతం అని లేకుండా రాష్ట్రం నాలుగుచెరగులా వైసిపి దూసుకుపోయింది. సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతోబాటు అభివృద్ధి ప్రాజెక్టులు పరిశ్రమల వంటివి ప్రజలతో భళా అనిపించాయి. దీంతో జనం వేరేమాట, వేరే ఆలోచనలేకుండా ఏకపక్షంగా ఫ్యానుకు ఓటేసి జగన్ కు జై కొట్టారు.