ప్రస్తుత రాజకీయాలు కలుషితమై పోయాయని పెద్దలు చెప్పే మాట వాస్తవమే. రాజకీయాల్లో విలువలు వేగంగా పడిపోతున్నాయి. దీనికి ఉదాహరణ ఖమ్మం జిల్లా పాలేరు ఉప ఎన్నికలే ఉదాహరణ. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా జన్మించి, కాంగ్రెస్ భూస్ధాపితమే లక్ష్యంగా మొదలైన టిడిపి... చంద్రబాబు, సోనియా గాంధీలనే టార్గెట్ చేస్తూ ఏర్పడిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ, టిడిపిని, వైసీపీలను శత్రువులుగా చూసే సోనియాగాంధీ, ఆమె అనుచరులు వీరందరూ ఈ ఉప ఎన్నికల నేపథ్యంలో రాజకీయ అవసరాల కోసం, అధికార టిఆర్‌ఎస్‌ను ఎదుర్కోవడం కోసం చేతులు కలిపారు. కాగా పాలేరు ఉప ఎన్నికల సందర్భంగా వెలిసిన కటౌట్లు, ఫ్లెక్స్‌లలో సోనియాగాంధీ, స్వర్గీయ ఎన్టీఆర్, చంద్రబాబు, వైయస్ రాజశేఖర్‌రెడ్డి, జగన్‌ల ఫొటోలు ఒకే చోట కనిపిస్తుండటంతో విస్తుపోవడం సామాన్యుల వంతైంది. శత్రువుకు, శత్రువు మిత్రుడనే సామెతను గుర్తు చేస్తూ ఈ ఫ్లెక్సీలు నిలువుటద్దంలా, రాజకీయ దిగజారుడుతనానికి పరాకాష్టగా మారాయి. ప్రజలలో మాత్రం ద్వేషాలు రెచ్చగొట్టే నాయకులు తమ అవసరాల కోసం ఎంతకైనా దిగజారుతారని, చివరకు వెర్రివాళ్లుగా మిగిలేది సగటు అభిమానులు, కార్యకర్తలే అని ఈ ఫ్లెకీలను చూసిన ఎవరైనా ఇట్టే చెబుతారు. మరి వీరి అవకాశవాదాలకు బుద్ది చెప్పాల్సిన బాధ్యత సగటు ఓటర్ల మీదనే ఉంది.