సమైక్యాంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత తమిళనాడు గవర్నర్ రోశయ్య ఇటీవల మాట్లాడుతూ... తెలుగురాష్ట్రం రెండుగా విడిపోయిన నేపథ్యంలో ఈ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒకరికి ఒకరు సహకరించుకుంటేనే అభివృద్ది సాధ్యమని తేల్చిచెప్పాడు. కొత్తగా ఏర్పడిన రెండు రాష్ట్రాలు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయని, తాను త్వరలో జరిగే జాతీయ గవర్నర్ల సదస్సులో ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లుతానని మాట ఇచ్చాడు. ఆంద్రప్రదేశ్ విషయానికి వస్తే రాష్ట్ర ఆదాయాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉందంటూనే ప్రజలపై భారం పడకుండా చూసుకోవాలని హితవు చెప్పారు. రాష్ట్ర ఆదాయం బయటకు పోకుండా గట్టి చర్యలు తీసుకోవాలని చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు. 16 సార్లు బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఘనత, వరుసగా ఏడు సార్లు ఒక రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఆర్ధిక మంత్రిగా ఆయన చేసిన హిత బోధ సరిగానే ఉంది. మర్రి చెన్నారెడ్డి, కోట్ల విజయభాస్కర్‌రెడ్డి, నేదురుమల్లి జనార్ధన్‌రెడ్డి, వైయస్ రాజశేఖర్‌రెడ్డి వంటి వారి హయాంలో ఆయన మంత్రిగా పనిచేసిన అనుభవజ్ఞుడు. వైఎస్ మరణం తర్వాత ఆయన సీఎం పీఠం అధిరోహించారు. కానీ ముఖ్యమంత్రిగా ఆయనేమీ చేయలేకపోయాడని, రాష్ట్రం విడిపోవడానికి ఆయన చేతగాని తనమే కారణమని ఇప్పటికీ ఏపీ ప్రజలు భావిస్తున్నారు. ఆయన చేతగాని తనం వల్లే కేసీఆర్ నిరాహారదీక్ష, ఆయన ఇచ్చిన సూచనల మేరకే రాష్ట్రాన్ని విడగొట్టాలని సోనియా భావించిందని అప్పుడే సమైక్యాంద్ర ఉద్యమకారులు భావించారు. అదే ఆస్దానంలో ముందుగా కిరణ్‌కుమార్‌రెడ్డినే సీఎంను చేసివున్నా, లేదా రాజశేఖర్‌రెడ్డి బతికివుండి ఉంటే రాష్ట్రం విడిపోయేది కాదని మెజార్టీ ప్రజల అభిప్రాయం. చివరకు రోశయ్య రాష్ట్రాన్ని పాలించడం తన వల్ల కాదని చెబుతూ చేతులు ఎత్తివేశాడు. ముఖ్యమంత్రి పదవిని తనకు తానుగా వదులుకున్న మొదటి ముఖ్యమంత్రి రోశయ్యే కావచ్చని ఇప్పటికీ ఆయనపై సెటైర్లు వేస్తుంటారు కొందరు. కాగా రోశయ్య ఇద్దరు ముఖ్యమంత్రులు కలిసి పనిచేయాలని ఆయన కోరుతున్న మాట నిజమే..! కానీ ప్రస్తుతానికి మౌనంగా ఉన్నప్పటికీ ఏపీ, తెలంగాణ సీఎంల మధ్య పరిస్థితి నివ్వురుగప్పిన నిప్పులా ఉందనేది వాస్తవం. యుద్దం చేతగాని వాడే ధర్మ సూక్తులు, అహింస గురించి మాట్లాడుతారంటున్నారు. మొత్తానికి ఈ పెద్దాయన ఇచ్చిన సలహాను ఇద్దరు ముఖ్యమంత్రులు ఏమాత్రం ఆచరిస్తారో వేచిచూడాల్సివుంది..!