పవన్‌కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీకి ఇప్పటికే తెలంగాణలో ఈసీ గుర్తింపు దక్కింది. తాజాగా ఏపీలో కూడా దానికి గుర్తింపువచ్చింది. అయితే పార్టీ గుర్తు మాత్రం ఇంకా రాలేదు. దీంతో 2019లో జనసేన ప్రత్యక్ష ఎన్నికల్లోకి దిగడం ఖాయంగా కనిపిస్తోంది. పవన్‌కు ఆవేశం, ఆక్రోశం ఎక్కువ. ప్రజలకు ఏదో చేయాలన్న తప్పన ఉన్నప్పటికీ రాజకీయాల్లో ఆవేశానికి చోటు ఉండకూడదు. తన అన్నయ్య చిరంజీవి చేసిన పొరపాట్లు చేయకుండా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. ఒక్క పొరపాటు జరిగినా రాజకీయాల్లో మనుగడే ప్రశ్నార్ధకం అవుతుంది. గతంలో మహామహాలు కూడా ఇలాంటి తప్పులు చేసి ఘోరంగా ఓడిపోయారు.... నష్టపోయారు. 1983లో కాంగ్రెస్‌ను మట్టికరిపించిన స్వర్గీయ ఎన్టీఆర్ 1989 ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయారు. హైటెక్ సీఎంగా పేరుతెచ్చుకున్న చంద్రబాబు విద్యుత్ చార్జీల పెంపుకు నిరసన తెలుపుతున్న వారిపై పోలీస్ కాల్పులు, అన్నదాతల ఆగ్రహం, ఉద్యోగుల వ్యతిరేకతతో ఓడిపోయారు. ఇక 2008లో ప్రజారాజ్యం పార్టీని స్దాపించిన చిరంజీవి 2009 ఎన్నికల్లో పెద్దగా సీట్లు గెలుచుకోలేనప్పటికీ ఓట్ షేర్‌ను మాత్రం బాగా సాధించాడు. దాంతో కొద్ది సంవత్సరాలు ఓపిక పడితే ఆయన సీఎం అయ్యే అవకాశం ఉందని అందరూ భావించారు. కానీ ఆయన ఓ తప్పుడు నిర్ణయం తీసుకొన 2011లో తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసి, కేంద్రమంత్రి పదవితో సరిపెట్టుకున్నాడు. ఇది రాజకీయంగా పెద్ద పొరపాటు అని చెప్పాలి. ఇక వైయస్ జగన్ విషయానికి వస్తే ఆయన కాంగ్రెస్‌లోనే ఉండివుంటే, కేంద్రమంత్రి అయ ఉండేవాడు. అంతేకాదు.. సమైక్య ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రి కూడా అయ్యే అవకాశం ఉందని నాడు అందరూభావించారు. కాంగ్రెస్‌ను వీడడంతో కేసులు ఎదుర్కొంటున్నాడు. ప్రజలకు ఏదో చేయాలనే తపన, ఆవేశంతోపాటు రాజకీయ చతురత కూడా చాలా ముఖ్యమని పవన్ తెలుసుకొని ముందుకు సాగితేనే ఆయనకు భవిష్యత్తు.