ఒకవైపు సేవ్ డెమొక్రసీ పేరుతో జగన్, ఆయన పార్టీనేతలు ఢిల్లీలో పర్యటనలు చేస్తున్నారు. అక్కడ జాతీయపార్టీ నాయకులను, బిజెపి అగ్రనేతలను కలుస్తున్నారు. జగన్‌కు బిజెపి అధినాయకత్వం అడిగిన వెంటనే అపాయింట్‌మెంట్లు ఇస్తున్నారు. చంద్రబాబు అవినీతిపై ప్రచురించిన పుస్తకాన్ని జగన్ అందరికీ పంచిపెడుతున్నారు. దీంతో ఏపీ బ్రాండ్‌కు జగన్ మచ్చ తెస్తున్నాడని, 1లక్ష 34కోట్ల అవినీతి జరిగిందని జగన్ ప్రచారం చేయడాన్ని టిడిపి తప్పుపడుతోంది. దానికి ఒక్క సాక్షమైనా చూపించగలరా? అంటూ సవాల్ విసురుతోంది. కానీ జగన్ మాత్రం తన పని తాను చేసుకుపోతున్నాడు. గతంలో రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన చేసిన అవినీతిపై సాక్ష్యాధారాలతో సహా చంద్రబాబు అండ్ టీం ఓ పుస్తకం ప్రచురించి ఇలాగే ఢిల్లీ వెళ్లి నాయకులను కలిసే ప్రయత్నం చేసింది. కానీ నాటి ప్రధాని మన్మోహన్‌సింగ్‌గానీ, సోనియాగాంధీతో పాటు మరికొందరు చంద్రబాబు అండ్ టీంకు అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వలేదు. ఈ విషయంలో టిడిపి నేతలు బిజెపి అధినాయత్వం జగన్ ఎప్పుడు అడిగితే అప్పుడు ఉదారంగా అపాయింట్‌మెంట్లు ఇవ్వడం, జగన్‌తో చనువుగా మెసలడం పట్ల టిడిపి నాయకత్వం గుర్రుగాఉంది. తాము ఎన్డీఏ భాగస్వామ్యపార్టీమని, రాష్ట్రంలో తమకు బిజెపితో పొత్తు ఉన్న విషయాన్ని కూడా మరిచి ఈ విధంగా బిజెపి నాయకులు ప్రవర్తించడం తమను అవమానించడమే అని సీఎం చంద్రబాబు కూడా గుర్రుగా ఉన్నారు. కానీ జగన్‌కు 9మంది ఎంపీలు ఉన్నారు. చాలా పార్టీలతో పోలిస్తే జగన్‌కు ఉన్న ఎంపీలే ఎక్కువ మంది. దీంతో భవిష్యత్తులో జగన్‌తో అవసరం ఉంటుందని, టిడిపిపై ప్రజల్లో వ్యతిరేకత వస్తోందని భావించే బిజెపి నాయకత్వం జగన్‌కు రెడ్ కార్పెట్ పరుస్తోందనే అనుమానాలను టిడిపీ సీనియర్ నాయకులు వ్యక్తం చేస్తున్నారు. మరోవంక రాష్ట్రానికి చెందిన బిజెపి కేంద్రమంత్రుల వైఖరిలో కూడా మార్పు వస్తోంది. రాష్ట్రానికి ఎంతో ఆర్ధిక సాయం చేస్తున్నామని, కానీ టిడిపీ పేద అరుపులు అరుస్తోందని, అయినా కేంద్రం మీద ఆధారపడటం సరికాదని, చంద్రబాబు రాష్ట్ర అవసరాలకు సంబంధించిన నిధులను ఎలాగైనా సాధించుకోగలరని సెటైర్లు వేస్తోంది. చివరకు చంద్రబాబు అంటే ఎంతో అభిమానం ఉన్న వెంకయ్యనాయుడు కూడా ఇదే తరహా వ్యాఖ్యలతో బాబును టార్గెట్ చేస్తున్నారు. సో.. త్వరలో బిజెపి విషయంలో టిడిపి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచిచూడాల్సివుంది..!