దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తనను తానే లాక్ చేసుకునేందుకు సిద్ధపడుతున్నారా? అంటే అవుననే తాజా పరిణామం చెబుతోంది. ఇప్పటికే `మహాభారతం` డ్రీమ్ ప్రాజెక్ట్ గురించి రాజమౌళి, విజయేంద్ర ప్రసాద్ అధికారికంగా ధృవీకరించారు. ఇటీవల నాని `హిట్ 3` ఈవెంట్లోను రాజమౌళి స్వయంగా ప్రాజెక్ట్ ని ధృవీకరించారు.
తాజా పరిణామం చూస్తుంటే, రాజమౌళి పురాణేతిహాసాలపై భారీ చిత్రాల్ని రూపొందించాలని కసిగా ఉన్నారని అర్థమవుతోంది. ముఖ్యంగా తన డ్రీమ్ ప్రాజెక్ట్ `మహాభారతం`ని మూడు భాగాలుగా తెరకెక్కించేందుకు అతడు ఏకంగా ఎనిమిదేళ్ల సమయం కేటాయిస్తాడని గుసగుసలు వినిపిస్తున్నాయి.
అంతేకాదు మార్వల్ సినిమాటిక్స్ తరహాలో అత్యంత భారీ విజువల్స్ తో మహాభారతాన్ని తెరకెక్కించాల్సి ఉంటుంది గనుక దానికోసం కఠోరంగా తపస్సు చేయాల్సి ఉంటుంది. మహేష్‌తో సినిమా తర్వాత మరో ఎనిమిదేళ్ల పాటు సమయం కేటాయించడం అంటే జక్కన్నకు ఇదే చివరి సినిమా అవుతుందని కూడా కొందరు గెస్ చేస్తున్నారు. రాజమౌళి `మహాభారతం`లో భారతదేశంలోని అన్ని సినీపరిశ్రమల (టాలీవుడ్- బాలీవుడ్- కోలీవుడ్- శాండల్వుడ్- మాలీవుడ్) నుంచి టాప్ స్టార్లు నటించేందుకు అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.