ముంబై- జుహు శివారులో అమితాబ్ బచ్చన్, హేమ మాలిని, అక్షయ్ కుమార్, హృతిక్ రోషన్ , శత్రుఘ్న సిన్హా వంటి తారలు నివసించే శివారు ప్రాంతంలో ఒక వ్యాపార దిగ్గజం జన్మించాడు. 1984లో రఘునందన్ శ్రీనివాస్ కామత్ మొట్టమొదటి నేచురల్స్ ఐస్ క్రీం పార్లర్‌ను ఇక్కడే స్థాపించాడు. కామత్ తన చేతితో తయారు చేసిన, పండ్లతో నిండిన ఐస్ క్రీములతో అందరినీ ఆకర్షించాడు. కామత్ వ్యూహాత్మకంగా జుహులో తన మొదటి అవుట్‌లెట్ ని ప్రారంభించాడు. సెలబ్రిటీల ఇండ్ల పక్కనే ఈ ఐస్ క్రీమ్ పార్లర్ అందరినీ ఆకర్షించింది.
అతడి తండ్రి పండ్ల వ్యాపారి. కేవలం 14 సంవత్సరాల వయసులో అతడు తన సోదరుడి తినుబండారం `గోకుల్ రిఫ్రెష్‌మెంట్స్`లో సహాయం చేయడానికి స్కూల్ వదిలేసాడు. అక్కడే అతడి మెదడులో నేచురల్ ఐస్ క్రీమ్ ఆలోచన వేళ్ళూనుకుంది. కృత్రిమ రుచులు లేదా భారీ ఉత్పత్తిపై ఆధారపడని ఐస్ క్రీమ్‌ను అతడు ఊహించాడు. భారతదేశంలోని పండ్లలో ఉండే గొప్పతనాన్ని అతడు ఐస్ క్రీమ్ లలోకి చేర్చి సెలబ్రేట్ చేసాడు.
తన సోదరుడితో విడిపోయిన తర్వాత కామత్ రూ. 3.5 లక్షలు పెట్టుబడి పెట్టి కేవలం ఆరుగురు సిబ్బందితో .. 200 చదరపు అడుగుల చిన్న దుకాణంతో నేచురల్స్ ఐస్ క్రీంను ప్రారంభించాడు. అతడి ఆలోచన వర్కవుటైంది. పండ్లు, పాలు, చక్కెర అనే సాధారణ, లేత కొబ్బరి, పదార్థాలతో స్వచ్ఛమైన, పండ్ల ఆధారిత ఐస్ క్రీంలను తయారు చేయడం తన ఉద్ధేశం. ప్రారంభ మెనూలో సీతాఫల్ జాక్‌ఫ్రూట్, మస్క్‌మెలోన్ , కాలా జామున్ వంటి 12 రుచులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఆ సమయంలో కమర్షియల్ బ్రాండ్ ఐస్ క్రీంలలో ఇవి అంతగా వినిపించలేదు. దాని కారణంగా వేగంగా నేచురల్స్ ప్రత్యేకతను చాటుకుంది. అతడు నోటి మాట మీద ఆధారపడి పత్రికల్లో ప్రకటనలను పరిమితం చేసాడు. మంచి ఉత్పత్తి తనకు తానుగా మాట్లాడుతుందని అతను నమ్మాడు. అనుకున్నదే జరిగింది. సంవత్సరాలుగా నేచురల్స్ మెనూ గజర్ హల్వా, తిలగుల్, దోసకాయ , ప్రసాదం వంటి బోల్డ్ వెరైటీలతో ఏ సమయంలోనైనా అందుబాటులో ఉన్న 20 కంటే ఎక్కువ రుచులను అందించాడు.
నేచురల్స్ ఐస్ క్రీం ఇప్పుడు భారతదేశంలోని 15 రాష్ట్రాలలో 165 కంటే ఎక్కువ అవుట్‌లెట్‌లతో రూ. 300 కోట్ల టర్నోవర్ ఉన్న సంస్థగా అభివృద్ధి చెందింది. ఈ ఐస్ క్రీమ్ కొబ్బరి రుచి అంతర్జాతీయ గుర్తింపును కూడా పొందింది. నేటికీ సరిహద్దులను అధిగమించి, కంపెనీ ఇటీవల 24/7 ఐస్ క్రీం లను అందించడానికి వెండింగ్ మెషీన్‌లను ప్రవేశపెట్టింది. రఘునందన్ కామత్ 2024లో 75 సంవత్సరాల వయస్సులో మరణించారు. జుహులోని ఒక చిన్న దుకాణం నుండి లక్షలాది మంది ఆరాధించే దేశవ్యాప్త బ్రాండ్ వరకు అతడి ప్రయాణం వెనక ఒక సాధారణ ఆలోచన, స్వచ్ఛమైన పదార్థాలు.. ఒక అచంచలమైన డ్రీమ్ ఉన్నాయి.