ఖిలాడీ అక్షయ్ కుమార్ నటించిన తాజా చిత్రం కేసరి 2 మంచి సమీక్షలను అందుకుంది. అక్కీ కొంత కాలంగా పరాజయాల బాటలో ఉన్నాడు. ఎట్టకేలకు అతడి సినిమా పాజిటివ్ టాక్ అందుకుంది. కోర్ట్ రూమ్ డ్రామాలో అతడి నటనకు ప్రశంసలు కురుస్తున్నాయి. పలువురు సినీరాజకీయ ప్రముఖులు ఈ సినిమాని వీక్షించి ప్రశంసలు కురిపిస్తున్నారు.
తాజాగా కాంగ్రెస్ నాయకుడు శశి థరూర్ అక్షయ్ కుమార్ నటించిన `కేసరి చాప్టర్ 2` సినిమా చూసిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ .. ఇది అందరూ చూడాల్సిన సినిమా అంటూ కితాబిచ్చారు. థరూర్ తన సుదీర్ఘ సమీక్షలో చిత్ర బృందాన్ని ప్రశంసించారు. దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలు దీనిని చూడాలని తాను సిఫార్సు చేస్తానని శశి థరూర్ చెప్పారు. అయితే ఆయన సినిమాలోని కొన్ని చారిత్రక తప్పులను కూడా ఎత్తి చూపారు. సి. శంకరన్ నాయర్ ఈ సినిమాలో అక్షయ్ కుమార్ ఉపయోగించిన పదాలను ఎప్పుడూ ఉపయోగించరని అన్నారు. అయితే సినిమాలో బలమైన సందేశాన్ని ఆవిష్కరించినందుకు శశి థరూర్ ప్రశంసించారు. చారిత్రక వాస్తవంతో రూపొందించిన సినిమాకి కొంత స్వేచ్ఛ అవసరం. జలియన్ వాలాబాగ్ దురంతం తర్వాత 28 సంవత్సరాలు స్వేచ్ఛగా ఉండటానికి మనం విచారకరంగా వేచి ఉన్నాము. కానీ సినిమా సందేశం అద్భుతంగా పండింది... అని థరూర్ అన్నారు. క్లైమాక్స్ లో బ్రిటీష్ వారు ఎప్పటికీ చెప్పని సారీ అనే పదం చెప్పాలని కోరారు. కానీ వారు ఎప్పటికీ చెప్పరు.
నటన, దర్శకత్వం, కథ చెప్పిన విధానం ప్రతిదీ చాలా ఆకర్షణీయంగా మలిచారు. ఒక్క క్షణం కూడా నీరసం రాలేదు. చాలా మందికి కోర్టు గది దృశ్యాలను చూడటం అంత ఆకర్షణీయంగా ఉండకపోవచ్చని నేను ఆందోళన చెందాను. కానీ కథ బయటకు వచ్చిన విధానం, ఒక్క క్షణం కూడా మీ దృష్టిని మరల్చడం అసాధ్యం.. అంత బాగా చేసారు! అని శశిథరూర్ అన్నారు.
కేసరి 2 సినిమా రఘు పలాట్ , పుష్ప పలాట్ రాసిన `ది కేస్ దట్ షుక్ ది ఎంపైర్` పుస్తకం ఆధారంగా రూపొందింది. ఇది సి. శంకరన్ నాయర్ - 1919 జలియన్ వాలాబాగ్ ఊచకోత తర్వాత జరిగిన సంఘటనలపై ఈ పుస్తకాన్ని రాసారు. ఈ సినిమాలో అక్షయ్ కుమార్ సి. శంకరన్ నాయర్ పాత్రను పోషించారు. కేసరి చాప్టర్ 2 ప్రశంసలు అందుకుంటోంది. ఇందులో ఆర్ మాధవన్ , అనన్య పాండే కూడా నటించారు.