బాలీవుడ్ లో మరో నటవారసురాలు సినీరంగంలో ప్రవేశిస్తోంది. లెజెండరీ నటుడు రాజేష్ ఖన్నా మనవరాలు నవోమికా శరణ్ నటనలో అడుగుపెడుతోంది. కుటుంబంలో అరడజను పైగా స్టార్లు ఉండగా, వారి నుంచి నవోమిక నటనా పరంగా టిప్స్ తీసుకుంటోందని సమాచారం. నవోమిక ఇటీవల సినిమా ఈవెంట్లలో మెరుస్తోంది. ఇంకా సిగ్గరిగా కనిపిస్తున్నా కానీ, ఫోటోగ్రాఫర్లను చిరునవ్వుతో పలకరించింది.
2004లో జన్మించిన నవోమికా, రచయిత్రి - మాజీ నటి ట్వింకిల్ ఖన్నా మేనకోడలు , ట్వింకిల్ - అక్షయ్ కుమార్ ల పిల్లలు ఆరవ్, నితారా కుమార్ లకు బంధువు. హర్యానాలోని గురుగ్రామ్‌లో పాఠశాల విద్యను పూర్తి చేసి, ముంబైలోని సెయింట్ జేవియర్స్ కళాశాలలో ఉన్నత విద్యను అభ్యసించింది. ప్రస్తుతం లండన్‌లో చదువుతోంది. ఇటీవల స్టడీస్ పై దృష్టి సారించింది.
నవోమికా ముంబైలో జరిగిన మాడ్డాక్ ఫిల్మ్స్ కార్యక్రమంలో తన అమ్మమ్మ డింపుల్ కపాడియాతో కలిసి కనిపించాక ఈ బ్యూటీ కూడా సినీరంగంలో అడుగులు వేయడం ఖాయమేనన్న చర్చా సాగింది. సినిమా వేడుకలో ప్రత్యక్షమైన ఈ యంగ్ లేడీని తాత రాజేష్ ఖన్నాతో ప్రజలు పోల్చి చూస్తున్నారు. తల్లి రింకే ఖన్నా-తాత రాజేష్ ఖన్నా ఇద్దరినీ పోలి ఉండటంతో నవోమికపై నెటిజన్లలో ప్రశంసలు కురుస్తున్నాయి.
నటనలోకి వస్తున్నానని నవోమిక ప్రకటించకపోయినా కానీ, తన బహిరంగ ప్రదర్శనలు, కుటుంబ సంబంధాలు బాలీవుడ్ అరంగేట్రం గురించి ఊహాగానాలకు దారితీశాయి. ఆమె అమితాబ్ మనవడు, నటవారసుడు అగస్త్య నందా సరసన ఒక చిత్రంలో నటించే అవకాశం ఉందని కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి.