పగలు మేల్కొనడం, రాత్రి నిదురించడం సాధారణంగా అందరూ చేసే పని.. అది నచ్చక రాత్రి పని చేసి, పగలు నిదురిస్తానని చెప్పారు, దిగ్గజ సంగీత దర్శకుడు, స్వరమాంత్రికుడు ఏ.ఆర్.రెహమాన్. తెల్లవారు ఝామున 2.30కు నిదుర లేస్తానని, 7 ఏఎం నిదురపోతానని కూడా రెహమాన్ తాజా ఇంటర్వ్యూలో వెల్లడించారు. తాను ప్రయాణాలు చేస్తానని, రాత్రిపూట పనిచేస్తానని, తెల్లవారుజామున దర్గాను సందర్శిస్తానని ఏఆర్ రెహమాన్ తన అలవాటు గురించి చెప్పారు. పగటిపూట హడావుడి మధ్య పని చేయడం తనకు ఇష్టం ఉండదని, రాత్రి పూట నిశ్శబ్ధంలో బాగా దృష్టి పెట్టగలనని అన్నారు.
``నేను రాత్రిపూట గుడ్లగూబను.. ఎక్కడికైనా వెళ్ళగలను. నేను కొన్నిసార్లు ఉదయాన్నే దర్గాకు వెళ్తాను.. ఆపై ట్రాఫిక్ తో పని లేకుండా నిద్రపోతాను. తాళ్ చిత్రీకరణ సమయం నుంచి ఇలాగే ఉన్నాను`` అని తెలిపారు. రాత్రిపూట నిద్రపోవడం, ఉదయం మేల్కొనడం సాధారణ విషయం.. బోరింగ్ అని రెహమాన్ అన్నారు. తన జీవన శైలికి ఇది సరిపడదని అన్నారు. తనకు ముంబైలో రాత్రి పూట ప్రయాణించడం చాలా ఇష్టమని కూడా రెహమాన్ తెలిపారు.
పగలు ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి రాత్రి పూట ప్రయాణిస్తానని అన్నాడు. సహజంగానే రెహమాన్ రాత్రి 9 గంటలకు రికార్డింగ్ పని మొదలు పెట్టి ఉదయం 7 గంటల వరకూ పని చేస్తాడని తాళ్ దర్శకుడు సుభాష్ ఘయ్ గతంలో ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. సృజనాత్మకత పేరుతో తెల్లవారు ఝామున 2- 3.30 మధ్య నిదుర చెడగొడతాడని, తాను వేరే కమిట్ మెంట్లతో బిజీగా ఉన్నా రాత్రులు రెహమాన్ చిక్కులు తెచ్చి పెడతాడని గతంలో సీనియర్ గాయకుడు అభిజీత్ భట్టాచార్య విమర్శించారు. రెహమాన్ స్టూడియోలో ఎక్కువ సమయం వేచి చూసి విసిగిపోవాలని అతడు ఆవేదన చెందాడు.