మలయాళ చిత్రపరిశ్రమలో మాదక ద్రవ్యాల వినియోగం పెద్ద స్థాయిలో ఉందని, ఇందులో ప్రముఖ నటులు కూడా ఉన్నారని నటుడు షైన్ టామ్ చాకో విచారణ అధికారులకు చెప్పినట్టు సమాచారం. పరిశ్రమలో డ్రగ్స్ వినియోగం అధికంగా ఉందని అతడి మాటలు చెబుతున్నాయి. తాను ఇంకో నటుడు మాత్రమే బాధ్యులం కాదని అతడు అధికారులతో విచారణ సమయంలో అన్నాడు. మమ్మల్ని మాత్రమే ఎందుకు నిందిస్తున్నారు? డ్రగ్స్ వాడే చాలా మంది ప్రముఖులను గుర్తించడం లేదు ఎందుకని! అని అతడు వాపోయాడు.
ఈ విచారణలో భాగంగా మరిన్ని ఆధారాల కోసం పోలీసులు షైన్ ఫోన్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతనికి సంబంధించిన అనుమానాస్పద ఆర్థిక లావాదేవీలను కూడా కనుగొన్నారు. ఇటీవల జరిగిన రూ.2,000 నుండి రూ.5,000 మధ్య జరిగిన దాదాపు 14 ఆర్థిక లావాదేవీలు మాదకద్రవ్యాల కొనుగోళ్లకు సంబంధించినవని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే ఇవి పలువురు తనకు ఇచ్చిన అప్పులు అని షైన్ వివరించాడు. కమిషనర్ విజయన్ సమక్షంలో సమీక్షా సమావేశం తర్వాత టామ్ చాకోను మరిన్ని విషయాలపై పోలీసులు ప్రశ్నిస్తారని తెలిసింది. అతడిపై రెండో దశ విచారణ తదుపరి జరగనుంది.
ఇంతకుముందు పోలీసులు పిలిచినప్పుడు తన అసౌకర్యాన్ని బయటపెట్టిన టామ్ చాకో కోసం కొంత సమయాన్ని పోలీసులు ఇచ్చారు. ఈరోజు అతడిని విచారించారు. కమీషనర్ సమక్షంలో వాంగ్మూలాలు, ఆధారాలను సమీక్షించిన తర్వాత తదుపరి విచారణకు సంబంధించిన నిర్ణయాలు తీసుకుంటారని తెలిసింది.