పవన్ కల్యాణ్ సరసన `బద్రి` చిత్రంలో నటించింది అమీషా పటేల్. బ్లాక్ బస్టర్ తో ఆరంగేట్రం చేసిన ఈ బ్యూటీ ఆ తర్వాత టాలీవుడ్ లో పలువురు అగ్ర హీరోల సరసన నటించింది. హిందీ చిత్రసీమలో హృతిక్ రోషన్ సరసన కహో నా ప్యార్ హైతో కథానాయికగా కెరీర్‌ను ప్రారంభించింది. ఇది భారీ విజయాన్ని సాధించింది. ఆ తర్వాత సన్నీ డియోల్‌తో కలిసి `గదర్: ఏక్ ప్రేమ్ కథ`లో నటించింది. ఈ చిత్రం బ్లాక్‌బస్టర్ అయ్యాక తన స్టార్ డమ్ మారుతుందని భావించినా అలా జరగలేదు. గదర్ -ఏక్ ప్రేమ్ కథ (గదర్-1) ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1.33 బిలియన్ డాలర్లు వసూలు చేసింది. అయినా ఇది తన ఫేట్ ని ఏమాత్రం మార్చలేదు.
పలువురు బడా దర్శకనిర్మాతలతో పని చేసే అవకాశాల్ని కోల్పోయింది అమీషా. అయితే దీనికి కారణం తన మేనేజర్ అని కూడా అమీషా పటేల్ గుర్తించినట్టు చెప్పింది. అప్పటి మేనేజర్‌తో సమస్యల కారణంగా అగ్ర దర్శకనిర్మాతల నుంచి అవకాశాల్ని కోల్పోయానని తెలిపింది. సిద్ధార్థ్ కన్నన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో, సంజయ్ లీలా భన్సాలీ కూడా తన మేనేజర్‌తో సానుకూలంగా లేకపోవడంతో ఆయనతో ప్రాజెక్టులకు దూరంగా ఉన్నానని అమీషా వెల్లడించింది. ఇలా కోల్పోయినవన్నీ తన కెరీర్ పై ప్రభావం చూపాయని గుర్తు చేసుకుంది.
ఓవైపు కెరీర్ తిరోగమనంలో వరుస ఫ్లాపులు కూడా మరింతగా చెడ్డ పేరు తెచ్చాయని చెప్పింది. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో చిన్న పాత్రల్లో కనిపించినా అవేవీ అంతగా గుర్తుంచుకోదగినవి కాకపోవడంతో ఆల్మోస్ట్ అమీషా తెరమరుగైంది. అయితే పరిశ్రమలో గాడ్‌ఫాదర్ ఉండి ఉంటే తన కెరీర్‌ను కాపాడేవాడని అమీషా తెలిపింది. ఇటీవలే సన్నీడియోల్ తో కలిసి గదర్ 2లో నటించిన అమీషా భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే.