సహనటుడు తనతో అసభ్యంగా ప్రవర్తించాడని క్రమశిక్షణా కమిటీకి ఫిర్యాదు చేసిన ప్రముఖ నటి ఇప్పుడు దానికి రిగ్రెట్ ఫీలవుతున్నట్టు సమాచారం. అంతేకాదు.. అంతర్గత క్రమశిక్షణా కమిటీ- ఫిలింఛాంబర్ పెద్దలు సదరు నటుడి పేరును బయటకు లీక్ చేయమని మాటిచ్చినా ``నమ్మక ద్రోహంతో దెబ్బ తీసార``ని ఫీలవుతోంది. దీంతో తాను ఇచ్చిన ఫిర్యాదును వెనక్కి తీసుకుంటున్నానని ప్రకటించి అందరికీ షాకిచ్చింది.
అయితే ఇప్పటికే ఆ నటుడికి జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న సినిమా ఆగిపోయింది. దీంతో నిందలన్నీ సదరు ఫిర్యాదీ అయిన నటి భరించాల్సి వస్తోంది. ఒకరు చేసిన తప్పునకు ఇప్పుడు సినిమా యూనిట్ అంతా ఉపాధి కోల్పోయిన పరిస్థితి తలెత్తింది. నిజానికి ఆ నటి ఫిలింఛాంబర్, అంతర్గత కమిటీకి ఫిర్యాదు చేసినప్పుడు ఇంత రచ్చవుతుందని అనుకోలేదు. కమిటీ విచారించి అతడికి బుద్ధి చెప్పాలని, సినిమాను ఇది ప్రభావితం చేయకూడదని కోరుకున్నట్టు తెలిపింది.
సోషల్ మీడియాలో వ్యాఖ్యానిస్తూ.. నటుడు తన దుస్తులకు ఏర్పడిన చిక్కును సరిచేస్తానని చొరవ తీసుకున్నాడు. అలాగే రిహార్సల్స్ సమయంలో తెల్లటి పౌడర్ (డ్రగ్స్) పీల్చడం చూసానని ప్రకటించగానే ఇటు పోలీసులు, అటు నార్కోటిక్స్ అధికారులు అలెర్ట్ అయిపోయి అతడి హోటల్ పై రైడ్ కి వెళ్లారు. దీనికి కంగారు పడిన సదరు నటుడు హోటల్ నుంచి పారిపోయాడు. దానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ తీసుకుని పోలీసులు, ఎన్సీబీ అతడి కోసం వెతుకులాడటం చర్చగా మారింది.
ఏది ఏమైనా ఈ రాద్ధాంతం అంతా చూసి సదరు నటి ఖంగు తింది. తాను చేతులు కాలాక ఆకులు పట్టుకున్నానని గ్రహించింది. ఆ నటుడు చేసినది తప్పే.. కాదని అనలేం. కానీ తాను ఇచ్చిన ఫిర్యాదు ఇలా ప్రకంపనాలు రేపుతుందని ఊహించలేదు. పైగా ఇప్పుడు సినిమా యూనిట్ మొత్తం తనవల్ల ఇబ్బందుల్లో పడ్డారు. సినిమా ఆగిపోయిందని ఆవేదన చెందుతోందట. నటుడిపై ఫిర్యాదును బాధితురాలైన నటి వెనక్కి తీసుకున్నా కానీ, నార్కోటిక్స్ అధికారులు కానీ, పోలీసులు కానీ అతడిని విడిచిపెట్టేట్టు కనిపించడం లేదు. వారు దర్యాప్తును ముందుకు సాగిస్తున్నారు.