దెయ్యాలు భూతాలు కథలతో బాలీవుడ్ బాగానే హిట్లు కొడుతోంది. సౌత్ లో తీసిన వాటినే తిప్పి తీస్తూ, అక్కడ వందల కోట్లు కొల్లగొట్టడం ఆశ్చర్యపరుస్తోంది. ఉత్తరాదిన ఆత్మలు లేవని వాదించేవాళ్లు కూడా థియేటర్లకు వెళ్లి భయాందోళనలకు గురవుతున్నారు. అంతగా హారర్ సినిమాలు మెప్పిస్తున్నాయి. అందుకే ఇప్పటికీ ఈ జానర్ ని వదిలిపెట్టడం లేదు.
ఇదిలా ఉంటే.. నిజ జీవితంలోనే ఆత్మ ఆవహించిందని చెప్పి ఉలిక్కిపాటుకు గురి చేసింది ప్రముఖ నటీమణి. తనను ఆ దెయ్యం ముట్టుకోలేదు కానీ, తన ముత్తాతను గట్టిగా పట్టుకుందట. దెబ్బలు పడతాయ్ రో మామా! దెబ్బలు పడతాయ్! అంటూ వెంబడించిందట. దొరికిన చోట గట్టిగానే మొట్టేసిందని కూడా చెప్పింది. దీంతో ఆ ఇల్లు ఓవర్ నైట్ లో ఖాళీ చేసి ఉడాయించారని కూడా ఈ నటి చెప్పింది. అపుడో ఇపుడో ఎపుడో కొందరు ఇలాంటి దెయ్యం దెబ్బలు అలవాటు పడి ఉండొచ్చు. కానీ ఈ నటి ముత్తాత అనభవం చాలా భయానకమైనది.
దాదాపు 800కోట్ల విలువైన పటౌడీ ఆస్థానం పక్కనే ఉన్న ఒక పురాతన భవంతిలో ఆ నటి కుటుంబం ఒక రాత్రి గడపాల్సి వచ్చిందట. ఆ కుటుంబం ఆ రాత్రి అక్కడ నిదురపోలేదు. అందులో ఒక ఆత్మ తన ముత్తాతను లెంపకాయ కొట్టింది. ముఖంపై ఘాటు ఉన్న ఆ ఆత్మను ప్రత్యక్షంగా చూశానని కూడా ముత్తాత చెప్పాడు. దీంతో ఝడుసుకుపోయిన కుటుంబ సభ్యులు తెల్లారేసరికి బట్టలు సర్ధేసుకుని పటౌడీ ప్యాలెస్ లోకి షిఫ్టయిపోయారు. మొత్తానికి ఆ ఒక్క ఘటన తర్వాత ఎవరూ ఆ పురాతన బంగ్లా వైపు చూడలేదు. అయితే అదృష్టవశాత్తూ ఆ రాత్రి ఈ నటి వారితో లేదు. ప్రస్తుతం తాను నటించిన చోరి 2 సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న సోహా అలీఖాన్ ఈ విషయాన్ని చెప్పింది. సోహా ప్రముఖ నటుడు సైఫ్ ఖాన్ చెల్లెలు అన్న సంగతి తెలిసిందే. వారి తాత ముత్తాతలు చక్రవర్తులు. సంస్థానాలను కలిగి ఉన్నారు. పటౌడీ సంస్థానం ఇప్పుడు ఎనిమిది వందల కోట్లు పలుకుతోంది.