ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ ఇటీవల అగ్నిప్రమాదంలో గాయపడిన ఘటన కుటుంబీకులు, అభిమానులను కంగారు పెట్టిన సంగతి తెలిసిందే. సింగపూర్ లో మార్క్ చదువుకుంటున్న స్కూల్ లో ఈ ప్రమాదం జరిగింది. ఘటన గురించి తెలిసిన వెంటనే చిరంజీవి- సురేఖ దంపతులతో పాటు, పవన్ కల్యాణ్ సింగపూర్ వెళ్లి మార్క్ శంకర్ కి దగ్గర ఉండి వైద్యం చేయించారు. చిన్నారి కోలుకున్న తర్వాత తిరిగి హైదరాబాద్ కి వచ్చారు.
ప్రస్తుతం పవన్ కల్యాణ్ కి అత్యంత సన్నిహితులైన సినీరాజకీయ ప్రముఖులు, సెలబ్రిటీలు అంతా అతడి ఇంటికి పరామర్శకు విచ్చేస్తున్నారు. ఈ సోమవారం సాయంత్రం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, అతడి భార్య స్నేహారెడ్డి నేరుగా పవన్ కల్యాణ్ ఇంటికి వెళ్లి పరామర్శించారు. దాదాపు గంట సేపు పవన్ కుటుంబంతోనే గడిపారని తెలుస్తోంది. ఈ పరామర్శకు సంబంధించిన ఫోటోలు కానీ, వీడియోలు కానీ ఇంకా విడుదల కాలేదు.
మామ అల్లుళ్ల మధ్య కొన్ని విభేధాలున్నాయని గతంలో కథనాలొచ్చాయి. కానీ కష్ట సమయాల్లో అవేవీ కనిపించవు. ఇంతకుముందు అల్లు అర్జున్ ని అరెస్ట్ చేసినప్పుడు పవన్ వెంటనే ఫోన్ లో మాట్లాడారని మీడియాలో కథనాలొచ్చాయి. ఇప్పుడు పవన్ కి కష్టం రాగానే, అల్లుడు వెంటనే ఇలా పరామర్శకు దిగొచ్చారు. సోషల్ మీడియాల్లో వైరం గురించి చాలా ప్రచారం సాగిస్తున్నా, దానికి విరుద్ధంగా మెగా కుటుంబం నడుచుకుంటుందని చాలా సందర్భాల్లో నిరూపణ అయింది.