యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్ లో మొదటి 1000 కోట్ల క్లబ్ సినిమా- ఆర్.ఆర్.ఆర్. దేవర చిత్రం 500 కోట్ల క్లబ్ లో చేరింది. తదుపరి `వార్ 2`తో 1000 కోట్ల క్లబ్ లో చేరాలని ఉవ్విళ్లూరుతున్నాడు. హృతిక్ రోషన్- ఎన్టీఆర్ లాంటి దిగ్గజ హీరోలు ఈ సినిమాలో నటిస్తున్నారు కాబట్టి అభిమానుల్లో వార్ 2పైనా భారీ అంచనాలున్నాయి. ఇద్దరు మేటి డ్యాన్సింగ్ స్టార్లు, యాక్షన్ ఇమేజ్ ఉన్న స్టార్ల కలయికలో ఈ సినిమా వస్తుండడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఆగస్టులో ఈ విడుదల కానున్న ఈ చిత్రం రికార్డులు బ్రేక్ చేయడం ఖాయమని నమ్ముతున్నారు.
తాజాగా `అర్జున్ సన్నాఫ్ వైజయతి`(కళ్యాణ్ రామ్) ప్రీరిలీజ్ వేడుకలో వార్ 2 గురించి యంగ్ టైగర్ ప్రస్థావించారు. హృతిక్ తో వార్ 2 బాగా వచ్చిందని ధీమాను, నమ్మకాన్ని కనబరిచారు. అతడి ముఖంలో వెలుగులు చూస్తుంటే వార్ 2తో మరో 1000 కోట్ల క్లబ్ అందుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ తో సినిమా కోసం ప్రిపరేషన్ లో ఉన్న ఎన్టీఆర్ పూర్తిగా సన్నబడి కొత్త లుక్ తో కనిపిస్తున్నాడు.
ఎన్టీఆర్ తన పాత్ర కోసం బాగా పీలగా మారిపోవడం అభిమానులను కలవరపరుస్తున్నా, ఎంపిక చేసుకున్న పాత్రలోకి పరకాయ ప్రవేశం చేయడం కోసమే ఇలా మారాడని అభిమానులు భావిస్తున్నారు. ఎన్టీఆర్ కెరీర్ లో వార్ 2, ప్రశాంత్ నీల్ తో సినిమా రెండూ 1000 కోట్ల క్లబ్‌లో చేరాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.