యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర చిత్రం విడుదల సమయంలో ఓపెన్ గ్రౌండ్ లో అభిమానుల నడుమ ఎలాంటి ఈవెంట్ చేయలేకపోయారు. దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ సమయంలో అభిమానుల తొక్కిసలాటతో ఆ ఈవెంట్ రద్దయ్యింది, తర్వాత దేవర 1 సక్సెస్ సెలబ్రేషన్స్ కి అనుమతులు లభించలేదు. దానితో గత కొన్నేళ్లుగా ఎన్టీఆర్ ని ప్రత్యక్షంగా పబ్లిక్ ఈవెంట్స్ లో చూడలేకపోయామనే బాధ అభిమానుల్లో ఎక్కువైంది. అందుకే ఎన్టీఆర్ స్వయంగా తన అభిమానులతో కలిసి ఫ్యాన్స్ మీట్ పెడతానని మాటిచ్చారు.
అది నెరవేరకుండానే ఎన్టీఆర్ మ్యాడ్ స్క్వేర్, అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి ఈవెంట్స్ కి గెస్ట్ గా రావడంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేవు. అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి ఈవెంట్ లో విజయశాంతి మాట్లాడుతుండగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ రచ్చ రచ్చ చెయ్యడంతో ఇలాగైతే నేను స్టేజ్ దిగి వెళ్ళిపోతాను అంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ పై ఒకింత ఆగ్రహం వ్యక్త చేసారు.
తర్వాత ఎన్టీఆర్ మాట్లాడుతూ తాను త్వరలోనే ఫ్యాన్స్ మీట్ లో అందరిని కలుసుకుంటాను, కాస్త ప్లాన్ చేసుకోనివ్వండి, తొందర పెట్టొద్దు, ఖచ్చితంగా ఈఏడాది లోనే ఫ్యాన్స్ మీట్ లో మిమ్మల్ని కలుస్తాను అంటూ అభిమానుల ఆరాటాన్ని, ఆత్రుతని తగ్గిచి అభిమానులకు ఎన్టీఆర్ హామీ ఇచ్చేసారు.