అమ్మ జయలలిత తమిళనాడు ముఖ్యమంత్రిగా కొన్నేళ్ల పాటు ఏలిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో రాష్ట్ర అస్తవ్యస్త పరిస్థితులు, అవ్యవస్థ గురించి, ప్రజా సమస్యల గురించి ప్రస్థావిస్తూ సూపర్ స్టార్ రజనీకాంత్ చేసిన ఓ వ్యాఖ్య ప్రకంపనాలు రేపింది. అప్పటి నుంచి ఆ ఇద్దరూ బద్ధ శత్రువులుగా మారారు. ఒకరితో ఒకరు నువ్వా నేనా? అంటూ తలపడే పరిస్థితి వచ్చింది. అంతేకాదు... రజనీ మైండ్ లో రాజకీయం అనే ఆలోచనకు శ్రీకారం చుట్టింది ఆ అరుదైన ఘటన.
నాటి ఘటన గురించి రజనీ సన్నిహితుడు, నిర్మాత ఆర్.ఎం.వీరప్పన్ ఓ డాక్యుమెంటరీలో వెల్లడించడం ఇప్పుడు హాట్ టాపిగ్గా మారింది. బాషా శతదినోత్సవ వేడుకలో దూకుడుగా మాట్లాడిన రజనీకాంత్ అప్పటి ముఖ్యమంత్రి జయలలిత పాలనపై తీవ్రమైన కామెంట్ చేసారు. కుటిల రాజకీయాలతో రాష్ట్రం శ్మశాన వాటికగా మారిందని రజనీ కామెంట్ చేయడంతో అప్పటికి జయలలిత కొలువులో మంత్రిగా పని చేస్తున్న వీరప్పన్ సీఎం ఆగ్రహానికి గురై పదవిని కోల్పోవాల్సి వచ్చింది.
అయితే దీనిని సరిదిద్దేందుకు రజనీ ప్రయత్నించగా, వీరప్పన్ వారించి, మీ ఆత్మగౌరవాన్ని కోల్పోవాల్సిన అవసరం లేదని రజనీని కోరారు. అతడి మనోధైర్యం, వ్యక్తిత్వానికి చలించిన రజనీ అతడిని `కింగ్ మేకర్` అంటూ కీర్తించారు. ఆ ఘటన రజనీకాంత్ ఆలోచనలను మార్చేసింది. ఆయన మనసులో రాజకీయ ఆలోచనలు మొదలయ్యాయి. జయలలితతో నేరుగా ఢీకొట్టడం మొదలైంది. దాదాపు ముప్పై ఏళ్ల తర్వాత జయలలితతో వైరం గురించి ఇప్పుడు స్పష్ఠమైన కారణం బయటపడింది. నాడు బాషా శతదినోత్సవ వేదికపై రజనీ ఆ కామెంట్ చేయకపోయి ఉంటే, ఆయన దారి వేరొకలా ఉండేదేమో!