ఔట్ డేటెడ్ కథల పనైపోయింది. రెగ్యులర్ మాస్ మసాలా యాక్షన్ సినిమాలకు కాలం చెల్లింది. ఇప్పుడు ఏఐ జనరేషన్. ఏఐ - చాట్ జీపీటీ.. వీటన్నిటినీ మించిన అడ్వాన్స్ డ్ టెక్నాలజీ గురించి విస్త్రతంగా చర్చ సాగుతోంది. ప్రపంచవ్యాప్తంగా అధునాతన సంకేతికత వినియోగం ప్రజల్ని అడ్వాన్స్ డ్ వరల్డ్ లోకి చేర్చబోతోంది. దీని ప్రభావం సాధారణ ప్రజల జీవితాలపైనా ప్రతిబింబిస్తోంది. అంతేకాదు వినోద పరిశ్రమల్ని సాంకేతికత శాసిస్తోంది.
అయితే అడ్వాన్స్ డ్ టెక్నాలజీని అందిపుచ్చుకుని గొప్ప గూఢచారి నేపథ్య సినిమాల్ని తెరకెక్కించడంలో టామ్ క్రూజ్ ది అసాధారణ చరిత్ర. అతడు ప్రారంభించిన మిషన్ ఇంపాజిబుల్ (ఎంఐ) ఫ్రాంఛైజీ దశాబ్ధాల పాటు ప్రజల్ని అలరిస్తూనే ఉంది. ఈ సిరీస్ లో కొత్త సినిమా వేసవి ట్రీట్ కి రెడీ అవుతోంది.
మిషన్: ఇంపాజిబుల్ అనేది ఇంపాజిబుల్ మిషన్స్ ఫోర్స్ (IMF) అని పిలువబడే ఒక కల్పిత రహస్య గూఢచర్య సంస్థ ఆధారంగా రూపొందించిన మల్టీమీడియా ఫ్రాంచైజ్. ఈ ఫ్రాంచైజ్ 1966 టీవీ సిరీస్‌తో ప్రారంభమైంది ఇది ఏడు సీజన్లలో ప్రసారం అయింది. 1988లో రెండు సీజన్లలో పునరుద్ధరించగా మరోసారి ప్రజల్ని టీవీలకు అతుక్కుపోయేలా చేసింది. 1996 నుండి టామ్ క్రూజ్ నటించిన థియేట్రికల్ మోషన్ పిక్చర్‌ల సిరీస్ కి ప్రేరణనిచ్చింది. ఈ సిరీస్ లో ప్రధాన పాత్రధారి IMF ఏజెంట్ అయిన ఈథన్ హంట్. ఈ పాత్రను పోషించిన టామ్ క్రూజ్ స్వయంగా ఎంఐ సిరీస్ సినిమాలను నిర్మించారు. ఫ్రాంఛైజీలో ఎదురేలేని ఈథన్ హంట్ విన్యాసాలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న టామ్ ఫ్యాన్స్ ఆస్వాధిస్తూనే ఉన్నారు.
ఈ సిరీస్ నుంచి వచ్చిన గత చిత్రం `ఎంఐ: డెడ్ రికనింగ్` ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద అసాధారణ వసూళ్లను సాధించింది. ఇప్పుడు సిరీస్ నుంచి `ఎంఐ: ది ఫైనల్ రికనింగ్` వేసవిలో విడుదలకు సిద్ధమవుతోంది. టామ్ క్రూజ్ కి, ఎంఐ సిరీస్ కి భారతదేశంలోను అసాధారణ ఫ్యాన్స్ ఉన్నారు. అందువల్ల రాబోవు సినిమా 100కోట్లు పైగా వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారు. గూఢచారి నేపథ్య సినిమా తెలుగు వెర్షన్ ని రిలీజ్ చేయనున్నారని తెలుస్తోంది. గూఢచారి విశ్వంలో అరవివీర భయంకర సాహసాలు, గగుర్పాటుకు గురి చేసే ఛేజ్ లు, జంప్ లు వగైరా వైల్డ్ విన్యాసాలకు కొదవేమీ లేదు. తాజాగా ఫైనల్ రికనింగ్ ట్రైలర్ విడుదలై ఆద్యంతం రక్తి కట్టిస్తోంది. టామ్ క్రూజ్ ఫ్యాన్స్ ఈ విజువల్ గ్లింప్స్ ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. 23 మే 2025 రిలీజ్ డేట్ కోసం ఫ్యాన్స్ వేచి ఉండలేని పరిస్థితి. `ది ఎంటిటీ` అని పిలుచుకునే శక్తివంతమైన ఏఐకి వ్యతిరేకంగా టామ్ ఎలాంటి పోరాటం సాగించాడనేదే సినిమా. ఈ చిత్రానికి క్రిస్టోఫర్ మెక్‌క్వారీ దర్శకత్వం వహించగా, పారామౌంట్ పిక్చర్స్, స్కైడాన్స్ నిర్మించాయి.
టాలీవుడ్ లో ఎంఐ సిరీస్ ప్రేరణతో తెరకెక్కిన చిత్రాలకు గొప్ప ఆదరణ దక్కింది. గూఢచర్యం నేపథ్యంలో సూపర్ స్టార్ కృష్ణ పలు ప్రయోగాత్మక చిత్రాల్లో నటించగా వాటికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. సూపర్ స్టార్ వారసుడు మహేష్ బాబు నటించిన `వంశీ` చిత్రం స్పై యాక్షన్ కథాంశంతో రూపొందింది. గూఢచారి టైటిల్ తో అడివి శేష్ ప్రయోగం గొప్ప విజయవంతమైంది. ఈ సిరీస్ లో వరుస చిత్రాలను శేష్ అభిమానుల ముందుకు తేనున్నారు. ఇటీవల నిఖిల్ `స్పై` చిత్రంలో గూఢచారిగా నటించి మెప్పించాడు. అఖిల్ ఏజెంట్ స్పై కాన్సెప్టుతో వచ్చి నిరాశపరిచినా అతడు భవిష్యత్ లో మరిన్ని ప్రయోగాలు చేయడం ఖాయం. మునుముందు స్పై కథలతో మరిన్ని చిత్రాలు తెరకెక్కే వీలుంది. ఏఐ ఆధారిత కథలతో టాలీవుడ్ లోను ప్రయోగాలకు ఆస్కారం ఉంది. కానీ గూఢచారి నేపథ్య చిత్రాలు భారీ బడ్జెట్లతో తెరకెక్కాల్సి ఉంటుంది. టామ్ క్రూజ్ ఎంఐ నుంచి పాఠాలు నేర్చుకుని కొత్తతరం దర్శకులు భారీ పాన్ వరల్డ్ చిత్రాలను రూపొందిస్తారేమో వేచి చూడాలి.