అల్లూరి సీతారామరాజు జిల్లా డుంబ్రిగుడని పలు ప్రాంతాల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించారు. అడవితల్లి బాట కు శ్రీకారం చుట్టిన పవన్ కళ్యాణ్ అక్కడి గిరిజనుల కష్టసుఖాలను తెలుసుకున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపనలు చేసారు. ఈ నేపథ్యంలో గిరిజనులను ఉద్దేశించి పవన్ మాట్లాడుతున్న సందర్భంలో సీఎం గారు అంటూ చాలామంది కేకలు వేయడంతో పవన్ సరదాగా స్పందించారు.
నేను సీఎం కాదు.. డిప్యూటీ సీఎంను.. చంద్రబాబు గారూ మన సీఎం కన్ఫ్యూషన్ వద్దు అంటూ పవన్ కళ్యాణ్ సరదాగా వేసిన పంచ్ వైరల్ అయ్యింది. అంతేకాదు గిరిజన ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణానికి తాను సీఎం చంద్రబాబు గారిని నిధులు కోసం అడగగా ఆయన 24 గంటలు తిరిగేలోపే 49 కోట్లు నిధులు మంజూరు చేశారు. అందుకు సీఎం గారికి మనస్ఫూర్తిగా కృతఙ్ఞతలు తెలుపుకుంటున్నాను అన్నారు.
అడవితల్లి బాట కార్యక్రమంలో భాగంగా చాపరాయి నుంచి పెదపాడు వరకు 2.2 కిలోమీటర్ల మేర బీటీ రోడ్డును రూ. 2.12 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్నారు. పోరాట యాత్ర సమయంలో కురిడి గ్రామానికి కాలినడకన వెళ్లడం వల్ల గిరిజనులు పడుతున్న కష్టం తెలిసిందని.. అప్పుడే గిరిజన గ్రామాల అభివృద్ధికి నా వంతు కృషి చేయాలని నిర్ణయించుకున్నట్టు పవన్ చెప్పారు. అంతేకాకుండా త్వరలో నూతన పాఠశాల నిర్మిస్తానని హామీ ఇచ్చి వారికి తమాషా పిట్టకథల పుస్తకాలు, స్వీట్లు పంచారు పవన్ కళ్యాణ్.