సూపర్ స్టార్ రజనీకాంత్ తమిళనాడులో భారీ మాస్ ఫాలోయింగ్ తో ఇండస్ట్రీని దశాబ్ధాలుగా ఏల్తున్నారు. కోలీవుడ్ లో ఆయన నంబర్-1 స్టాటస్ ని ఎంజాయ్ చేసారు. అయితే రజనీ తర్వాతి తరంలో నంబర్ గేమ్ లో ముందుండే హీరో ఎవరు? అంటే ఇద్దరి పేర్లు ప్రముఖంగా వినిపిస్తాయి. ఆ ఇద్దరిలో ఒకరు తళా అజిత్.. మరొకరు దళపతి విజయ్. ఆ ఇద్దరూ నువ్వా నేనా? అంటూ పోటీపడుతూ బాక్సాఫీస్ వద్ద రికార్డుల్ని సృష్టించారు.
కానీ ఇటీవల తళా అజిత్ రేసులో పూర్తిగా వెనకబడ్డాడు. అతడు తన వృత్తిని పట్టించుకోకుండా, వ్యక్తిగత ప్రవృత్తిని అనుసరించడం ఒక ప్రధాన కారణం. ఓవైపు సినిమాలు చేస్తూనే, అజిత్ మోటార్ రేసింగ్‌లకు అడిక్ట్ అయ్యాడు. సినిమాల్లోకి రాకముందు నుంచి అతడు ఈ ప్రవృత్తితో జాతీయ స్థాయి క్రీడాకారుడిగాను గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇటీవల దుబాయ్ రేసింగ్ సహా విదేశాల్లో రేసింగ్ లలో పాల్గొని గ్రాండ్ సక్సెస్ అందుకున్నాడు. కానీ తళా అజిత్ ఆటలో పడి సినిమాలు వదిలేయడం అభిమానులకు నచ్చడం లేదు. అభిమానులు దీనిపై చాలా గుర్రుగా ఉన్నారు.
అతడు తన ఫోకస్ ని ఆటపైకి మళ్లించడంతో, కోలీవుడ్ లో నంబర్ వన్ స్టాటస్ ని దళపతి విజయ్ కొట్టేశాడు. దళపతి విజయ్ కూడా ఇప్పుడు రాజకీయాల్లోకి వెళ్లడంతో నంబర్ వన్ ప్లేస్ ఖాళీగా ఉంది. అజిత్ మళ్లీ తన సినిమాలపై దృష్టి సారిస్తే అతడకి నంబర్ -1 హోదా దక్కేందుకు ఛాన్సుంది. కానీ అతడు అలా ఆలోచిస్తున్నట్టు కనిపించడం లేదు. ఇటీవల అజిత్ నటించిన `విదాయముర్చి` ఆశించిన విజయం సాధించలేదు. అంతకుముందు కొన్ని వరుస ఫ్లాపులు ఎదురయ్యాయి. నెక్ట్స్ అతడి నుంచి గుడ్ బ్యాడ్ అగ్లీ విడుదలకు వస్తోంది. కానీ ఈ సినిమాపై ఆశించినంత బజ్ పెంచడంలో అజిత్ విఫలమయ్యాడని విమర్శలొస్తున్నాయి.
నిన్న గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమా థియేట్రికల్ ట్రైలర్ విడుదలయ్యాక కొంత పరిస్థితి మెరుగైంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామాకు అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించారు. థియేట్రికల్ ట్రైలర్ విడుదలకు గంట ముందు నుంచే తమిళనాడు అడ్వాన్స్ బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి. ప్రారంభ వేగం బాగానే ఉంది. కొన్ని గంటల్లోనే రూ. 4 కోట్లకు పైగా వసూలు చేసింది. విడుదలకు ఐదు రోజులు మిగిలి ఉండగా, భారీ ఓపెనింగ్స్ కోసం ఎదురు చూస్తున్నారు. గుడ్ బ్యాడ్ అగ్లీ రాష్ట్రంలో బీస్ట్ సినిమా ఓపెనింగ్ డే రికార్డును బద్దలు కొట్టగలదా? అంటూ చర్చ సాగుతోంది. దళపతి విజయ్ స్టాటస్‌ని అధిగమించి తళా తిరిగి రేసులోకి రావాలని కోరుకుంటున్నారు. అయితే అజిత్ కేవలం తమిళ మార్కెట్ పై ఫోకస్ చేసి ఇరుగు పొరుగు మార్కెట్లను పట్టించుకోకపోవడం సమస్యగా మారింది. అతడి తెలుగు మార్కెట్ ని తిరిగి పొందేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేయకపోవడం నిరాశపరుస్తోంది. తెలుగు స్టేట్స్ లోను ఫ్యాన్స్ ఉన్నా, అతడి నెగ్లజెన్సీ సమస్యగా మారిందని విమర్శలొస్తున్నాయి. కనీసం `గుడ్ బ్యాడ్ అగ్లీ` ప్రమోషన్స్ కోసం అయినా అతడు హైదరాబాద్ వస్తారేమో వేచి చూడాలి.
గుడ్ బ్యాడ్ అగ్లీలో త్రిష కథానాయిక. ప్రభు, ప్రసన్న, అర్జున్ దాస్, సునీల్, రాహుల్ దేవ్, యోగి బాబు కీలక పాత్రలు పోషించారు. జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. ఈ సినిమా ఏప్రిల్ 10న గ్రాండ్ రిలీజ్ కానుంది.