గత కొంతకాలంగా బాలీవుడ్ తిరోగమనంపై ఆసక్తికర డిబేట్ నడుస్తోంది. ముఖ్యంగా సినీరంగానికి చెందిన కొందరు పెద్దలు దీనిని సమీక్షిస్తున్నారు. ఈ సమీక్షలో బాలీవుడ్ దారుణ వైఫల్యానికి ఒక్కొక్కరూ ఒక్కో కారణం చెప్పారు. సుభాష్ ఘయ్ లాంటి ప్రముఖ దర్శకరచయిత అభిప్రాయం ప్రకారం.. రచయితలను సరిగా చూసుకోని పరిశ్రమలు మనుగడ సాగించవు. వారికి ఇచ్చే గౌరవం ఇవ్వకపోయినా.. వారికి చెల్లించాల్సిన పారితోషికం చెల్లించకపోయినా సత్తువ లేని కథలే వస్తాయి.. పరిశ్రమ నాశనం అవుతుంది! అని సూటిగా చెప్పారు.
రచయితలను దోపిడీ చేస్తే అది ఇండస్ట్రీకి తద్దినం పెట్టడం లాంటిదని పలువురు ప్రముఖులు అభిప్రాయపడ్డారు. ఒక బాలీవుడ్ విశ్లేషకుని ప్రకారం.. పెద్దతెరపై ఏది వర్కవుటవుతుందో నిర్మాతలకు ఇప్పుడు ఖచ్చితంగా తెలియదు. నటుల ఫీజుల విషయంలో వెనక్కి తగ్గరు. ఓటీటీలు లాభాలపై దృష్టి సారించడంతో వారు గతంలో లాగా ఇప్పుడు సినిమాలను కొనడం లేదు. ఫలితంగా చాలా తక్కువ మంది నిర్మాతలే సేఫ్ అవుతున్నారు అని తెలిపారు.
నిర్మాతలు భారీ పరపతిని పొందుతారు. ఒక స్క్రిప్ట్ ఖర్చు కోసం ఆలోచించకపోతే.. ఒక సినిమాకి వృధా అయ్యే డబ్బును వారు మూడు లేదా నాలుగు ప్రాజెక్టులలో పెట్టుబడి పెట్టవచ్చు. వారి నష్టాలను బాగా తగ్గించుకోవచ్చు. నష్టాన్ని పూర్తిగా రచయితలకు బదిలీ చేయవచ్చు. సినిమా ఆడకపోతే వారిదే బాధ్యత. అయితే ఇండస్ట్రీలో రచయితలు అన్ని నష్టాలను భరిస్తున్నా కానీ, లాభాలు పూర్తిగా నిర్మాతలు, నటుల జేబులలోకి మాత్రమే వెళ్తాయి. ఏం జరుగుతున్నా ఇక్కడ ఎటువంటి దిద్దుబాటు లేదు.. ఎవరూ వినడం లేదు! అని బాలీవుడ్ అనలిస్ట్ ఫరూఖీ వ్యాఖ్యానించారు. రచయితలు బాధపడతారు గనుకే మనం చెత్త సినిమాలు తీస్తాము అని ఆయన అన్నారు.
ప్రేక్షకులు కూడా ఇప్పుడు కథేంటో చూస్తున్నారు. స్క్రిప్ట్‌లు పేలవంగా ఉన్నందున థియేటర్ టిక్కెట్ల కోసం డబ్బు చెల్లించకూడదని చాలామంది భావిస్తున్నారు. అయితే ఈ పరిస్థితి ఎప్పుడూ ఇలా ఉండేది కాదు. రామ్ లఖన్, ఖల్నాయక్, తాళ్ వంటి చిత్రాలతో పాపులరైన ప్రముఖ ఫిలింమేకర్ సుభాష్ ఘాయ్ ఒకానొక సమయంలో 24 శాఖల్లో రచయిత అత్యంత ముఖ్యమైన వ్యక్తులలో ఒకరని అన్నారు. నటీనటుల ఎంపికకు కూడా ఆయన రచయితలను సంప్రదిస్తారు. మనకు భారతదేశంలో చాలా మంచి కథలు ఉన్నాయి, కానీ స్క్రీన్‌పై పండటానికి మనకు మంచి కథకులు అవసరం.. తెలివిలేని కథను చెప్పడానికి కూడా మనకు తెలివైన కథకుడు అవసరమని సుభాష్ ఘయ్ అన్నారు.
మార్కెట్‌లో మీరు వసూలు చేసే దానికంటే ఒక రూపాయి ఎక్కువ తీసుకోవాలని నేను ఎల్లప్పుడూ నా రచయితలకు చెప్పాను. కానీ మేం మంచి సినిమా కోసం పని చేయాలనుకుంటున్నాము. డబ్బు కోసమే, చెల్లింపు విధానాల కోసమో చర్చించము అని సుభాష్ ఘాయ్ వ్యాఖ్యానించారు. రచయితలకు ఎవరికైనా అత్యవసరంగా డబ్బు అవసరమైతే నేను ఒకేసారి పేమెంట్ అందరికీ చెల్లించడానికి అస్సలు ఆలోచించను. మా సంబంధం అలాగే ఉంది. పరస్పర నమ్మకం ఉంది. కానీ అది ఈరోజుల్లో లేదని సుభాష్ ఘయ్ చెప్పుకొచ్చారు.