ఆస్ట్రాలజర్ వేణు స్వామి సెలెబ్రిటీ జాతకాలపై చెసే కామెంట్స్ వైరల్ అవడమే కాదు, వేణు స్వామిని ఆ జాతకాలు సెలెబ్రిటీ ఆస్ట్రాలజర్ గా మార్చాయి. హీరోయిన్స్ ని జాతకాల పేర్లతో పూజలు చేయించడం సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉంటాయి. ఆ మధ్యన నాగ చైతన్య-శోభిత లపై చేసిన కామెంట్స్ విషయంలో మహిళా కమీషన్ విచారణ ఎదుర్కోవాల్సి వచ్చింది.
అయినప్పటికి బుద్ధి మార్చుకోని వేణు స్వామి మళ్లీ ఈమధ్యన సెలబ్రిటీస్ జాతకాలు చెబుతున్నాడు. రీసెంట్ గా విజయ్ దేవరకొండ, ప్రభాస్ పేర్లతో జాతకాలు చెప్పి ఫ్యాన్స్ ఆగ్రహానికి గురైన వేణు స్వామి ఇప్పుడు మహేష్ అభిమానులతో తిట్లు తింటున్నాడు. కారణం మహేష్ జాతక ప్రభావం వల్లే సూపర్ స్టార్ కృష్ణ మరణం సంభవించింది అంటూ వేణు స్వామి మహేష్ జాతకంపై కామెంట్స్ చేసారు.
తాను 1995 సంవత్సరం నుంచి కృష్ణ గారి ఇంట్లో పూజలు చేస్తున్నాను. అలా ఓ సందర్భంలో వారి జాతకాలపై నేను మొహమాటం లేకుండా చేసిన వ్యాఖ్యలతో నన్ను వాళ్లింట్లో పూజలకు పిలువడం మానేశారు. విజయనిర్మల ఇంట్లో పూజలు చేయడానికి వెళుతుండే నన్ను ఆమె ఎలా ఉంది జాతకం అని అడిగితే నేను ఉన్నది ఉన్నట్టుగా చెప్పాను. 2020 సంవత్సరం తర్వాత మీ ఇంట్లో మరణాలు ఉంటాయి అని చెప్పాను.
దానితో నరేష్ నన్ను పిలిచి అమ్మ ఆరోగ్యం గురించి తెలిసి అలా ఎందుకు చెప్పారు అని అడిగారు, ఆ తర్వాత వారి ఇంట్లో పూజలకు నన్ను పిలవడం మానేశారు, నేను జాతకం చెప్పిన ఆ సమయంలో మహేశ్ బాబు జాతకంలో శని గ్రహం మారుతున్నది. దాని ఎఫెక్ట్ కూడా తల్లిదండ్రుల జాతకంపై పడింది. జనవరి 16 తర్వాత వాళ్లింట్లో తల్లిదండ్రులకు ఏదో ఒక చెడు జరుగుతుందని గ్రహించాను. మహేశ్ బాబు గ్రహ స్థితి వల్లే కృష్ణ గారు చనిపోయారని మనం భావించవచ్చు అంటూ వేణు స్వామి చేసిన కామెంట్స్ పై మహేష్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.