ఇద్దరు ఆడాళ్ల మధ్య గొడవ మొదలైతే అది యుద్ధంగా మారే సందర్భాలే ఎక్కువ. మగువల మధ్య స్నేహం ఎప్పుడూ నీటి బుడగ లాంటిది. గ్లామర్ ఇండస్ట్రీలో అగ్ర కథానాయికలు ఒకరిపై ఒకరు కారాలు మిరియాలు నూరుకోవడం, క్యాట్ ఫైట్ కి సిద్ధం కావడం రెగ్యులర్ గా చూసేదే. అలాంటి గొడవలు అగ్ర కథానాయిక నయనతార, త్రిష మధ్య కూడా ఉన్నాయా? అంటే... దానికి నయనతార ఒకానొక సందర్భంలో చెప్పిన విషయాలు ఆశ్చర్యపరిచాయి. అసలు కారణం లేకుండానే, మాటల్లేవ్ మాట్లాడుకోడాల్లేవ్ అనే పరిస్థితులు ఎదురయ్యాయని నయన్ చెప్పింది.
సౌత్ లో అగ్ర నాయికలుగా ఓ వెలుగు వెలుగుతున్న నయనతార- త్రిష మధ్య ఒకప్పుడు నువ్వా నేనా? అంటూ పోటీ ఉండేది. ఆ ఇద్దరి మధ్యా పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత వైరం ఉందని కోలీవుడ్ మీడియా కథనాలు ప్రచురించింది. అయితే ఇదంతా నిజమేనా? అని ఓ ఇంటర్వ్యూవర్ నయనతారను ప్రశ్నించారు. దానికి నయన్ మాట్లాడుతూ.. నిజానికి త్రిష నాకు స్నేహితురాలు కాదు. పరిచయస్తురాలు మాత్రమే. అలాగని మా మధ్య మీద పడి కొట్టుకునేంత గొడవలేవీ లేవు. కానీ మా మధ్య సమస్యలు ఉన్నట్లు అనిపిస్తుంది. ఒక స్త్రీ మరో స్త్రీతో కలిసి ఉండరనే పురాతన సామెతలాంటిది ఇది. కానీ నిజాయితీగా చెప్పాలంటే నాకు త్రిషతో లేదా ఎవరితోనూ ఎటువంటి సమస్యలు లేవు. మా ఇద్దరి మధ్యా పోటీ గురించి మీడియాలో చాలా కథనాలు వచ్చాయి. కానీ మా మధ్య ఏమీ లేదు. కనీసం పత్రికల్లోకి రావాల్సిన అవసరం కూడా ఏమీ లేదు! అని నయనతార చెప్పింది.
బిల్లా(అజిత్ హీరో) కోస్టార్ నమితతో క్యాట్ ఫైట్ గురించి నయనతార ఆ సందర్భంలో ప్రస్థావించింది. ప్రారంభం మేం సెట్స్ లో బాగానే ఉన్నాం. చక్కగా మాట్లాడుకునేవాళ్లం. ఏమైందో అకస్మాత్తుగా నమిత నాతో మాట్లాడటం మానేసింది. పది మందిలో అందరికీ హాయ్ చెప్పి నన్ను విస్మరించేది. నాకు తెలిసి మా మధ్య ఎలాంటి సమస్యా లేదు. గొడవలు కూడా లేవు. కానీ మాట్లాడటం మానేసింది అని తెలిపింది నయన్.
కెరీర్ జర్నీలో నయనతార, త్రిష, నమితల ప్రయాణం గురించి తెలిసినదే. ఎవరికి వారు అగ్ర కథానాయికలుగా ఎదిగారు. నయన్, త్రిష ఇప్పటికీ తమ హోదాను స్థాయిని కొనసాగిస్తుంటే, నమిత పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిలైంది. ఇటీవల ఈ సీనియర్ భామలు నాయికా ప్రధాన చిత్రాలతోను అభిమానులను అలరిస్తున్న సంగతి తెలిసిందే.