ఓటీటీ ప్రపంచంలో పడి ఆడియన్స్ థియేటర్స్ కి వెళ్లే దారే మర్చిపోతున్నారు. థియేటర్స్ లో విడుదలైన నాలుగు వారాలకే ఆ సినిమాలు ఓటీటీలోకి వచ్చేస్తుండడంతో అందరూ ఓటీటీ లను రీఛార్జ్ చేసుకుని ఫ్యామిలీతో ఇంట్లోనే సినిమాలు చూసేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్, జీ 5, సోని లివ్, ఆహా, జియో హాట్ స్టార్ ఇలా ప్రముఖ ఓటీటీలలో ఏయే సినిమాలు వీకెండ్స్ లో అందుబాటులోకి వస్తున్నాయో వెతికి మరీ చూసేస్తున్నారు.
నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ లాంటి ఓటీటీలలో సినిమాలతో సహా వెబ్ సిరీస్ లు వస్తున్నాయి. ఇక ఓటీటీలో అన్ని భాషల సినిమాలు ఉంటున్నాయి, అందులో ముఖ్యంగా మలయాళీ ఫిలిమ్స్ ఓటీటీలో మిగతా లాంగ్వేజ్ సినిమాలని డామినేట్ చేస్తున్నాయి. మలయాళీ సస్పెన్స్ థ్రిల్లర్స్, కామెడీ మూవీస్ ని అక్కడి ప్రేక్షకులే కాదు తెలుగు, తమిళ్ ఆడియన్స్ బాగా ఇష్టపడుతున్నారు.
కొద్దిరోజులుగా మలయాళం మూవీస్ థియేటర్స్ లో సూపర్ హిట్ అవడమే తరువాయి.. నెల తిరిగేసరికి జీ 5, లేదంటే సోని లివ్ ఓటీటీలలో దర్శనమిస్తున్నాయి. ఈ ఏడాదిలో సూక్ష్మదర్శిని, బౌగెన్‌విల్లా, జోజు జ్జర్జ్ పని మూవీ, థొవినో థామస్ ఐడెంటిటీ, రేఖా చిత్రం, ఆఫీసర్ ఆన్ డ్యూటీ, అలాగే పోన్ మ్యాన్ ఇలా వరస సినిమాలు తెలుగులోను డబ్ అయ్యి ఓటీటీ ల నుంచి అందుబాటులోకి రావడంతో ఆడియన్స్ ఆ సినిమాలు చూసేందుకు తెగ ఇంట్రెస్ట్ చూపించారు.
మరి ఈమద్య కాలంలో ఏ లాంగ్వేజ్ మూవీస్ కి ఇంత డిమాండ్ కనిపించలేదు. ఒక్క మలయాళీ ఫిలిమ్స్ మాత్రమే బ్యాక్ టు బ్యాక్ ఆడియన్స్ చెంతకు చేరి శెభాష్ అనిపించుకుంటున్నాయి.