టాలీవుడ్‌లో అపజయం అనేది ఎరుగని దర్శకులలో అనిల్ రావిపూడి ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు. తన కెరీర్ ఆరంభం నుంచి వరుస విజయాలతో ముందుకు సాగుతూ.. ప్రతి సినిమాతో తన స్టైల్‌ను చాటి చెప్పాడు. తాజాగా సంక్రాంతి సందర్భంగా విడుదలైన సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో అనిల్ తన కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌ను అందుకున్నాడు. ఆయన సినిమాల్లో వినోదం, భావోద్వేగం సమపాళ్లలో ఉండటం ప్రేక్షకులను ఆకట్టుకునే కీలకమైన అంశం.
ఇదిలా ఉంటే అనిల్ రావిపూడి తన తదుపరి సినిమాను మెగాస్టార్ చిరంజీవితో చేయబోతున్న విషయం అందరికీ తెలిసిందే. ఇప్పటికే చిరంజీవికి ఓ కథ చెప్పి గ్రీన్ సిగ్నల్ తెచ్చుకున్న అనిల్, సినిమాను అధికారికంగా ప్రకటించాడు. కథకు సంబంధించి స్క్రిప్ట్ వర్క్‌ను పూర్తి చేసుకునేందుకు ఇటీవల వైజాగ్ వెళ్లాడు. అలాగే సింహాచలంలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్న సందర్భంలో ఈ ప్రాజెక్టుపై మాట్లాడి సినిమాపై మరింత ఆసక్తిని రేపాడు.
ఈ సినిమాకు సంబంధించి అనిల్ రావిపూడి కొన్ని కీలక విషయాలను వెల్లడించాడు. చిరంజీవిని ఆయన అభిమానులు ఎలా చూడాలనుకుంటున్నారో అలాంటి పాత్రలోనే మెగాస్టార్‌ను చూపించబోతున్నానని తెలిపాడు. గ్యాంగ్ లీడర్, ఘరానా మొగుడు, రౌడీ అల్లుడు తరహాలో ఈ సినిమా ఉంటుందని ఫ్యాన్స్‌కు మంచి అనుభూతి కలిగించేలా కథను సిద్ధం చేశానని అనిల్ పేర్కొన్నాడు. ఇందులో మెగాస్టార్ పాత్ర విభిన్నంగా ఉండటమే కాకుండా.. చిరంజీవి కామెడీ టైమింగ్‌కు తగ్గట్టుగా ప్రత్యేకమైన హాస్య సన్నివేశాలను కూడా రూపొందిస్తున్నట్లు సమాచారం.
ఇక తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకు సంబంధించి పూజా కార్యక్రమాలు ఉగాది పండుగ రోజు ప్రారంభం కానున్నట్లు ఫిల్మ్ నగర్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మెగాస్టార్ ప్రస్తుతం విశ్వంభర సినిమాతో బిజీగా ఉండగా దాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ కొత్త సినిమా పూర్తిస్థాయి వినోదాత్మక చిత్రంగా రూపొందనుండగా ఇందులో ప్రేమ కథాంశం లేకుండా కథలోనే కామెడీ, పాటలను సమపాళ్లలో మేళవించేలా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి ఈ చిత్రాన్ని నిర్మించనుండగా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్మాతలు నిర్ణయించినట్లు తెలుస్తోంది.