స్టార్ హీరో ప్రభాస్, డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో రాబోతున్న భారీ చిత్రం స్పిరిట్ గురించి ఆసక్తికర అప్‌డేట్ బయటకొచ్చింది. ఈ సినిమా అనౌన్స్ అయినప్పటి నుంచే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఇప్పటి వరకు షూటింగ్ మొదలుకాలేదు. ప్రభాస్ ప్రస్తుతం రాజా సాబ్, పౌజీ చిత్రాల షూటింగ్‌తో బిజీగా ఉండటంతో స్పిరిట్ ఆలస్యమవుతూ వచ్చింది. అయితే ఇక మళ్ళీ ఎటువంటి ఆలస్యం లేకుండా సినిమా షూటింగ్ ప్రారంభం కానుందని తెలుస్తోంది.
ఈ చిత్రానికి సంబంధించి స్క్రిప్ట్ వర్క్ పూర్తయినట్టు సమాచారం. దీంతో ఇక ఎలాంటి ఆటంకాలు లేకుండా సినిమా ప్రారంభోత్సవం చేసేందుకు టీమ్ సిద్ధమైందని తెలుస్తోంది. ప్రత్యేకంగా ఉగాది పండుగ సందర్భంగా ఈ సినిమా గ్రాండ్‌గా లాంచ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ప్రతి ఏడాది ఉగాది పర్వదినం కొత్త సినిమాల ప్రారంభానికి శుభసూచకంగా మారుతుంది. ఈసారి స్పిరిట్ కూడా అదే పండుగ రోజున లాంచ్ అవుతుందని సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
అయితే సినిమా అధికారికంగా లాంచ్ అయినా కూడా.. రెగ్యులర్ షూటింగ్ మాత్రం వెంటనే ప్రారంభం కాని అవకాశముంది. ప్రభాస్ ప్రస్తుతం రాజా సాబ్ క్లైమాక్స్ షూట్ పూర్తి చేసే దశలో ఉన్నాడు. మరోవైపు పౌజీ షూటింగ్‌కు ఇంకా కీలక షెడ్యూల్స్ మిగిలి ఉన్నాయి. ఈ రెండు ప్రాజెక్టులు పూర్తయిన తర్వాతే ప్రభాస్ స్పిరిట్ షూటింగ్‌లో పాల్గొంటాడని సమాచారం.
స్పిరిట్ సినిమాకు సంబంధించిన మరో ఆసక్తికర విషయమేమిటంటే ఇందులో ప్రభాస్ చాలా పవర్‌ఫుల్ క్యారెక్టర్‌లో కనిపించనున్నాడు. ఇప్పటి వరకు చేసిన పాత్రలకు పూర్తిగా భిన్నంగా ఉండేలా అతని పాత్రను డిజైన్ చేశారని టాక్. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా గతంలో కబీర్ సింగ్, ఏనిమల్ వంటి బ్లాక్‌బస్టర్ హిట్ సినిమాలతో ప్రేక్షకుల మనసు గెలుచుకున్నారు. ఆయన దర్శకత్వంలో ప్రభాస్ చేస్తున్న ప్రాజెక్ట్ కావడంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.
ఈ చిత్రాన్ని బాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ టీ సిరీస్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. ఇది పాన్ ఇండియా ప్రాజెక్ట్ మాత్రమే కాకుండా.. ఇంటర్నేషనల్ మార్కెట్‌ని టార్గెట్ చేస్తూ రూపొందించనున్న చిత్రంగా ప్రచారం జరుగుతోంది. ప్రభాస్ ఇప్పటికే సలార్, ఆదిపురుష్, రాధేశ్యామ్ వంటి బిగ్ బడ్జెట్ చిత్రాలతో అలరించగా.. స్పిరిట్ సినిమాతో మరో విభిన్నమైన కథాంశాన్ని ప్రేక్షకులకు అందించబోతున్నాడు.
మొత్తానికి స్పిరిట్ సినిమాకు సంబంధించి చాలా రోజులు నుంచి ఎదురు చూస్తున్న అభిమానులకు ఇది ఒక మంచి వార్త. త్వరలోనే అధికారికంగా చిత్ర బృందం ప్రకటించే అవకాశముంది. ప్రభాస్ అభిమానులు మాత్రం ఈ సినిమా ఎప్పుడెప్పుడు షురూ అవుతుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.