టాలీవుడ్, కోలీవుడ్ సినిమాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సమంత తనపై అభిమానులు చూపిస్తున్న ప్రేమను గుర్తుచేసుకుని హృదయపూర్వకంగా స్పందించారు. వారి అనుకూలత వల్లే తన ప్రయాణం ఇంతగా ఎదిగిందని.. తాను ఈ స్థాయికి రావడానికి కారణం అభిమానులే అని తెలిపారు. ఇటీవల చెన్నైలో జరిగిన బిహైండ్వుడ్స్ అవార్డుల వేడుకలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
ఈ కార్యక్రమంలో సమంతకు కె. బాలచందర్ హాల్ ఆఫ్ ఫేమ్ అవార్డు లభించింది. సినీ ఇండస్ట్రీలో ఆమె చేసిన ప్రయాణానికి గౌరవ సూచకంగా ఈ అవార్డును అందజేశారు. అవార్డు అందుకున్న అనంతరం సమంత తన హర్షాన్ని వ్యక్తం చేస్తూ.. ఈ అవార్డు నాకు ఎంతో ప్రత్యేకం. బాలచందర్ సార్ పేరుతో ఈ గౌరవాన్ని పొందడం గొప్ప విషయం. ఆయన సినిమాల్లోని మహిళా పాత్రలు ఎంతో సహజంగా ఉంటాయి. నాకు నటిగా ఎదగడానికి ఆయన సినిమాలు చాలా ప్రేరణగా నిలిచాయి. ఈ రోజు నా జీవితంలో మరపురాని రోజుగా నిలిచిపోతుంది అని అన్నారు.
అభిమానుల ప్రేమ గురించి మాట్లాడిన సమంత ఒక సినిమా విజయవంతమైనప్పుడు ప్రేక్షకుల నుంచి ప్రేమ లభించడం సహజం. కానీ నేను రెండు సంవత్సరాలుగా తమిళంలో ఒక్క సినిమా కూడా చేయలేదు. ఆ మధ్యకాలంలో పెద్ద హిట్ కూడా ఇవ్వలేదు. అయినా మీరు నాపై చూపిస్తున్న ప్రేమ తగ్గలేదు. మీ ప్రేమ చూస్తుంటే నాకు మాటలు రావడం లేదు. ఇంత ప్రేమ పొందేందుకు నేను ఏం చేశానో కూడా నాకు తెలియదు అని చెప్పారు.
ఈ వేడుకలో అభిమానులు ఆమెను స్టేజ్‌పై డ్యాన్స్ చేయమని కోరగా.. ఇప్పుడే నేను యాక్షన్ సీక్వెన్స్ పూర్తి చేసి వచ్చాను. అందుకే డ్యాన్స్ చేయడం కుదరదు అంటూ నవ్వుతూ సమాధానం ఇచ్చారు. అభిమానుల ప్రేమకూ, మద్దతుకూ ఆమె ఎప్పటికీ రుణపడి ఉంటానని తెలిపారు.
చెన్నైకు చెందిన సమంత 2010లో ఏ మాయ చేసావే సినిమాతో సినీరంగ ప్రవేశం చేశారు. ఆ చిత్రం తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. కెరీర్ ప్రారంభం నుంచే ఆమె వరుస సినిమాలు చేస్తూ తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్‌గా ఎదిగారు. 2022లో విడుదలైన కాతు వక్కుల రెండు కాదల్ తర్వాత ఆమె తమిళ చిత్రాల్లో కొత్త ప్రాజెక్ట్‌లను ఒప్పుకోలేదు. సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌లలో కూడా నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఇటీవల ఆమె సిటడెల్ హనీ బన్నీ ద్వారా తన ప్రతిభను మరోసారి నిరూపించారు.
ప్రస్తుతం సమంత చేతిలో రక్త బ్రహ్మాండ, మా ఇంటి బంగారం చిత్రాలు ఉన్నాయి. అదనంగా ఆమె నిర్మించిన శుభం చిత్రం కూడా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. అభిమానుల ఆశీర్వాదంతో మరిన్ని అద్భుతమైన ప్రాజెక్ట్‌లు చేయాలని సమంత భావిస్తున్నారు.