సినిమా పరిశ్రమలో విజయాలు, పరాజయాలు సహజమే అయినప్పటికీ ఇటీవల పూరి జగన్నాథ్ తెరకెక్కించిన లైగర్, డబుల్ ఇస్మార్ట్ సినిమాలు ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయాయి. ఈ ఫ్లాప్‌ల కారణంగా డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు భారీగా నష్టపోయారు. అయితే పూరి గత రికార్డు, మార్కెట్ లోని క్రేజ్‌ను చూస్తే మరో కొత్త ప్రాజెక్ట్‌కు సిద్ధమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇటీవలే పూరి జగన్నాథ్ చెన్నై వెళ్లి కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతికి ఓ కథ వినిపించినట్టు సమాచారం. కథ విజయ్‌కి నచ్చినప్పటికీ ఇంకా పలు అంశాలు చర్చల దశలోనే ఉన్నాయి. ఈ సినిమా నిర్మాణ బాధ్యతలను పూరి స్వయంగా తీసుకుంటాడా..? లేక ఓ పెద్ద బ్యానర్‌తో కలిసి చేయనున్నాడా..? అనే విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది.
సొంత బ్యానర్‌లో నిర్మిస్తే గత బాకీల క్లియరెన్స్ వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. అదే ఇతర నిర్మాణ సంస్థతో కలిసి చేస్తే ఆ రిస్క్ తగ్గిపోతుంది. అందుకే మైత్రీ మూవీ మేకర్స్ వంటి ప్రముఖ బ్యానర్‌లో సినిమా చేసే అవకాశాలున్నాయని ఫిల్మ్ సర్కిల్స్‌లో చర్చ నడుస్తోంది.
ప్రస్తుతం పూరి మరో భారీ చిత్ర కథను కూడా సిద్ధం చేస్తున్నాడని సమాచారం. ఈ ప్రాజెక్ట్ ఏ స్టార్ హీరోతో చేస్తాడు..? ఎప్పుడు అధికారిక ప్రకటన వస్తుంది..? అనే విషయాలు త్వరలోనే స్పష్టతకు వస్తాయి. మొత్తానికి పూరి మరోసారి తన స్టైల్‌లో ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధమవుతున్నాడని చెప్పొచ్చు.