ప్రతీ నటుడి కెరీర్‌లో ఒకసారి మాత్రమే కొన్ని ప్రత్యేకమైన కథలు వస్తాయి. మంచు విష్ణుకు కన్నప్ప సినిమా అలాంటి అరుదైన అవకాశం. ఈ కథను నేటితరం చాలా మంది స్టార్లు చేయాలని అనుకున్నా కొందరు ధైర్యం చేయలేకపోయారు. అయితే విష్ణు మాత్రం ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో ఎంతో గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు. భారీ భక్తి యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా మీద ఫిల్మ్ ఇండస్ట్రీలో భారీ అంచనాలు ఉన్నాయి.
ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్, మలయాళ మెగాస్టార్ మోహన్‌లాల్, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. వీరి భాగస్వామ్యం వల్ల సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది. ఏప్రిల్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమా కేవలం భక్తి ప్రధాన కథ మాత్రమే కాకుండా.. అద్భుతమైన విజువల్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వబోతోందని సమాచారం. ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో మంచు విష్ణు ఇందులో నటిస్తున్న స్టార్ హీరోల పాత్రలపై స్పష్టత ఇచ్చారు.
సినిమాలో ప్రభాస్, మోహన్‌లాల్, అక్షయ్ కుమార్ పాత్రలు చిన్నవి కాదని.. వీరి స్క్రీన్ ప్రెజెన్స్ వారికి ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చిపెట్టేలా ఉంటుందని విష్ణు పేర్కొన్నారు. వాళ్లు కేవలం కొన్ని నిమిషాల పాటు కనిపించే గెస్ట్ రోల్స్ అనుకునే అవసరం లేదని.. కథలో కీలక పాత్రలు పోషిస్తున్నారని వివరించారు. ముఖ్యంగా వీరి పాత్రలు సినిమాలో చక్కటి బలాన్ని ఇస్తాయని.. వీరి సన్నివేశాలు ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేసేలా ఉంటాయని ఆయన చెప్పారు.
ఈ సినిమా కాన్సెప్ట్, విజువల్ ప్రెజెంటేషన్ గురించి ఇప్పటికే సినీ వర్గాల్లో విపరీతమైన చర్చ జరుగుతోంది. స్టార్ హీరోల పాత్రలకు నిజమైన ప్రాధాన్యత ఇచ్చారని విష్ణు చెప్పిన వ్యాఖ్యలు సినిమాపై అంచనాలను మరింత పెంచేశాయి. శ్రీ ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రీతి ముకుందన్ కథానాయికగా నటిస్తోంది. అత్యున్నత స్థాయి టెక్నికల్ టీమ్ పని చేయడం, ప్రముఖ నటీనటుల భాగస్వామ్యం వల్ల కన్నప్ప సినిమా భారీ విజయం సాధించే అవకాశముందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.