ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఒకప్పుడు బాలీవుడ్ సినిమాలు అత్యున్నత స్థాయిలో నిలిచేవి. భారీ బడ్జెట్, విపరీతమైన మార్కెట్, అధిక కలెక్షన్లు అందుకోవడం వంటి అంశాల్లో ఇతర సినీ పరిశ్రమలకు అందనివిగా ఉండేవి. ఉత్తరాది ప్రేక్షకులు సౌత్ సినిమాలను పెద్దగా పట్టించుకునే పరిస్థితి లేదు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. దక్షిణాది సినిమాలు ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో భారీ వసూళ్లు సాధిస్తూ బాలీవుడ్ సినిమాలకు గట్టి పోటీ ఇస్తున్నాయి. బాలీవుడ్ సినిమాలు అంతగా ప్రభావం చూపించలేక పోతున్నాయి.
ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో ప్రముఖ రచయిత జావేద్ అక్తర్, బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్‌ను ఆసక్తికరమైన ప్రశ్న అడిగారు. దక్షిణాది నటీనటులు ఉత్తరాది ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేకపోయినా వారి సినిమాలు వందల కోట్ల వసూళ్లు సాధిస్తున్నాయి. కానీ బాలీవుడ్ సినిమాలు మాత్రం అంత స్థాయిలో ఆడడం లేదు. దీనికి అసలు కారణం ఏమిటి అంటూ జావేద్ ప్రశ్నించారు. బాలీవుడ్ చిత్రాలు ఆడియెన్స్‌తో కనెక్ట్ కాలేకపోతున్నాయా లేక మరోకటి కారణమా అంటూ అనుమానం వ్యక్తం చేశారు.
దీనికి స్పందించిన ఆమిర్ ఖాన్ సినిమా ఏ ప్రాంతానికి చెందినదో పెద్ద విషయం కాదు. ఉత్తరాదైనా దక్షిణాదైనా ప్రేక్షకులను ఆకట్టుకునే చిత్రాలు మాత్రమే విజయం సాధిస్తాయి అని చెప్పారు. అయితే బాలీవుడ్ వెనుకబడటానికి ఓటీటీ ప్లాట్ ఫామ్స్ ప్రధాన కారణమని అభిప్రాయపడ్డారు. మేము ప్రేక్షకులను థియేటర్‌కు రావాలని కోరుకుంటాం. కానీ వాళ్లు రాకపోతే 8 వారాల తర్వాత సినిమాను ఓటీటీ ద్వారా ఇంట్లోనే చూసేలా అందుబాటులోకి తెస్తున్నాం అని వివరించారు.
ఇంతకుముందు ప్రేక్షకులకు సినిమాను థియేటర్లో చూడడం తప్ప మరో ప్రత్యామ్నాయం ఉండేది కాదు. కానీ ఇప్పుడు వాళ్లు ఫ్యాన్సీగా అనిపించినప్పుడు మాత్రమే థియేటర్‌కు వస్తున్నారు. ఓటీటీ ప్లాట్ ఫామ్స్ వల్ల ప్రేక్షకులు ఇంట్లోనే సినిమాలను సులభంగా చూడగలుగుతున్నారు. దీంతో థియేటర్ బిజినెస్ మందగించిపోయింది. ఒకే సినిమాను రెండు సార్లు ఎలా విక్రయించాలో ఇప్పటికీ అర్థం కావడం లేదు అని ఆమిర్ అన్నారు.