బాలీవుడ్‌లో తన ప్రత్యేక గుర్తింపు కోసం కృషి చేస్తున్న ఖుషీ కపూర్, లెజెండరీ నటి శ్రీదేవి చిన్న కుమార్తెగా సినీ రంగ ప్రవేశం చేశారు. తాజాగా ఆమె తల్లి చివరిసారిగా నటించిన మామ్ (MOM) కంటిన్యూషన్ లో కనిపించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఐఫా అవార్డ్స్ కార్యక్రమంలో పాల్గొన్న బోనీ కపూర్ దీనిపై ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.
ఐఫా వేడుకలో శ్రీదేవిని గుర్తుచేసుకున్న బోనీ కపూర్, తన కుమార్తెల కెరీర్‌పై స్పందించారు. శ్రీదేవి తన సినిమాల ద్వారా అభిమానులను ఆకట్టుకున్నారు. ఆమె చివరిసారిగా కనిపించిన చిత్రం మామ్. ఆ కథను కొనసాగించాలనే ఆలోచన ఉంది అని తెలిపారు.
అలాగే ఖుషీ కపూర్ నటన గురించి మాట్లాడుతూ ఇప్పటివరకు ఖుషీ చేసిన సినిమాలు చూశాను. ఆర్బీస్, లవ్ యాపా వంటి చిత్రాల్లో మెప్పించింది. త్వరలోనే ఆమెతో ఓ సినిమా చేయబోతున్నాను. అది మామ్ 2 కావొచ్చు. తన తల్లిని ఆదర్శంగా తీసుకొని కెరీర్‌ను ముందుకు తీసుకెళ్లాలని ఆశిస్తున్నాను అని అన్నారు.
2017లో రవి ఉద్యావర్ దర్శకత్వం వహించిన మామ్ సినిమాను బోనీ కపూర్ నిర్మించారు. హిందీతో పాటు తెలుగు భాషల్లోనూ విడుదలైన ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. ఇందులో శ్రీదేవి పర్ఫార్మెన్స్‌కి విశేషమైన ప్రశంసలు లభించాయి. ఆమె మరణానంతరం ఉత్తమ నటి పురస్కారం కూడా అందుకుంది.
ఇప్పుడీ కథను కొనసాగించేందుకు మామ్ 2 ప్రాజెక్ట్‌పై పనులు ప్రారంభమయ్యాయి. ఖుషీ ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తుందా..? లేదా..? అన్నదానిపై అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుంది.