సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో ప్రేక్షకులకు దగ్గరైన నటి అభినయ నిశ్చితార్థం చేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. పుట్టుకతోనే ఆమె వినడం, మాట్లాడటం చేయలేని పరిస్థితిలో ఉన్నప్పటికీ తన నటనతో ప్రేక్షకుల మనసులను గెలుచుకుంది. నటిగా వరుస సినిమాల్లో కొనసాగుతున్న అభినయ తన వ్యక్తిగత జీవితాన్ని బయట పెట్టకుండా రహస్యంగా నిశ్చితార్థం చేసుకుంది.
చెన్నైకి చెందిన అభినయ 2008 నుంచి దక్షిణాది సినిమాల్లో నటిస్తోంది. ఆమె సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, ధృవ, దమ్ము, శంభో శివ శంభో, సీతారామం వంటి అనేక హిట్ చిత్రాల్లో కీలక పాత్రలు పోషించింది. ఇటీవల మలయాళంలో విడుదలైన పని అనే చిత్రంలో కథానాయికగా కూడా నటించింది.
గతంలో హీరో విశాల్‌తో అభినయ ప్రేమలో ఉన్నట్లు పుకార్లు వినిపించాయి. అయితే ఆ వార్తలను ఆమె ఖండిస్తూ తన చిన్ననాటి స్నేహితుడితో గత 15 సంవత్సరాలుగా ప్రేమలో ఉన్నానని త్వరలోనే పెళ్లి చేసుకోనున్నానని చెప్పింది. ఇప్పుడు ఆ మాటకు తగ్గట్లే నిశ్చితార్థం చేసుకుంది. అయితే తన కాబోయే భర్త గురించి ఎలాంటి వివరాలను వెల్లడించలేదు. అతని పేరు ఫోటోలను కూడా బయటపెట్టకుండానే నిశ్చితార్థాన్ని గోప్యంగా ఉంచింది.
అభినయ నిశ్చితార్థం వార్త తెలియగానే సినీ ప్రేమికులు, అభిమానులు ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. త్వరలోనే ఆమె పెళ్లి వేడుక ఎలా ఉంటుందో చూడాలి.