యువ సామ్రాట్ నాగ చైతన్య లేటెస్ట్ సంచలనం తండేల్ మూవీ ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయింది. ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ మూవీ ఓటీటీ విడుదల తేదీతో నెట్‌ఫ్లిక్స్ సంస్థ తండేల్ పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ పోస్టర్ ప్రకారం ఈ సినిమా మార్చి 7 నుండి తెలుగు, హిందీ, తమిళ్, మలయాళ, కన్నడ భాషలలో నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.
ఫిబ్రవరి 7న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం, విడుదలైన అన్నిచోట్ల దుల్లగొట్టేసే రెస్పాన్స్‌తో తక్కువ సమయంలోనే రూ. 100 కోట్ల క్లబ్‌లోకి చేరింది. ఇందులో ఉన్న కంటెంట్‌కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. సాయి పల్లవి నటన, చందూ మొండేటి దర్శకత్వ ప్రతిభ, గీతా ఆర్ట్స్ నిర్మాణ విలువలు అన్నీ కలిసి ఈ సినిమాను విజయ తీరానికి చేర్చాయి.
మరీ ముఖ్యంగా నాగ చైతన్య ఈ సినిమాతో నటన పరంగా మరో మెట్టు ఎక్కాడని అనిపించుకున్నాడు. ఎమోషనల్ సీన్స్‌లో అద్భుతంగా నటించాడనేలా అందరి ప్రశంసలు అందుకున్నాడు. మరో వైపు పైరసీ భూతం కూడా ఈ సినిమాను వెంటాడింది. అయినా కూడా థియేటర్లలో నిలబడి ఘన విజయం అందుకుందీ చిత్రం.
మరి థియేటర్లలో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న ఈ సినిమా ఓటీటీలో ఎలాంటి స్పందనను రాబట్టుకుంటుందో తెలియాలంటే మాత్రం మార్చి 7 వరకు వెయిట్ చేయాల్సిందే. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో గీతాఆర్ట్స్ బ్యానర్ పై బన్నీవాసు ఈ చిత్రాన్ని నిర్మించారు.