మ్యాడ్ స్క్వేర్ సినిమాకు సంబంధించిన కార్యక్రమంలో నిర్మాత నాగవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు అనుకున్న సమయానికి విడుదల అయితే తన నిర్మాణంలో రాబోతోన్న మ్యాడ్ స్క్వేర్ సినిమాను మార్చి 29న రిలీజ్ చేయబోమని ఆయన స్పష్టంగా చెప్పారు.
నాగవంశీ మాట్లాడుతూ.. హరిహర వీరమల్లు సినిమా నిజంగా మార్చి 28న వస్తుందా..? లేదా..? అనేది ఆ సినిమా టీమ్ చెప్పాలి. వాళ్లు అదే రోజున విడుదల చేస్తున్నామని ప్రకటిస్తే, మా సినిమా విడుదలను ముందుకు జరుపుతాం తప్పితే.. కళ్యాణ్‌గారి సినిమాకు మాత్రం పోటీగా వచ్చే ప్రస్తక్తే లేదని అన్నారు.
అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో సినిమా ప్రారంభమవుతోందని వస్తున్న వార్తలపై నాగవంశీ స్పందిస్తూ.. ఆ సినిమా ఇప్పుడే మొదలవ్వదు. 2025 రెండో భాగంలో (జూన్ తర్వాత) షూటింగ్ మొదలు పెట్టే అవకాశముందని చెప్పారు.
అలాగే డాకు మహారాజ్ సినిమా కలెక్షన్ల గురించి కూడా నాగవంశీ మాట్లాడారు. సంక్రాంతి సమయానికి పెద్ద సినిమాలు రిలీజ్ కావడంతో మా సినిమాపై ప్రభావం పడింది. అయితే, బాలకృష్ణ గారి సినిమాకు మాస్ ప్రేక్షకులు ఎక్కువగా వచ్చారు, అందువల్ల కొన్ని ప్రాంతాల్లో మంచి వసూళ్లు వచ్చాయి. కానీ, ఆశించిన స్థాయిలో కాదు. థియేటర్లలో అంతగా ఆడకపోయినా, ఓటీటీలో మాత్రం ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోందని వివరించారు. ప్రస్తుతం టాలీవుడ్‌లో పెద్ద సినిమాల పోటీ ఎక్కువగా ఉండటంతో, ఏ సినిమా అయినా ఒక్కటే విడుదల అవ్వడం కష్టమని నాగవంశీ అభిప్రాయపడ్డారు.