నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటోన్న చిత్రం అఖండ 2: తాండవం. సింహా, లెజెండ్, అఖండ తర్వాత నాల్గవసారి వీరిద్దరూ కొలాబరేట్ అవుతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా చిత్రీకరణను జరుపుకుంటోంది. ఇటీవల మహా కుంభమేళాలో కొన్ని సీన్లను బోయపాటి చిత్రీకరించిన విషయం తెలిసిందే. ఇప్పుడు హిమాలయాల్లో రెక్కీకి బయలు దేరినట్లుగా మేకర్స్ ఓ అప్డేట్ ఇచ్చారు.
అఖండ 2 సినిమా చిత్రీకరణ నిమిత్తం హిమాలయాల్లోని అద్భుతమైన ప్రదేశాలలో ఈ సినిమా చిత్రీకరణను జరిపేందుకు బోయపాటి ప్లాన్ చేశారు. హిమాలయాలలో చిత్రీకరించే సన్నివేశాలు ఈ సినిమాకు ప్రధాన హైలెట్‌గా నిలుస్తాయని మేకర్స్ చెబుతున్నారు. అక్కడి లొకేషన్లను చూసేందుకు ఆల్రెడీ బోయపాటి హిమాలయాలకు వెళ్లారని తెలుస్తుంది.
బాలయ్య సరసన సంయుక్త హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాను 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మిస్తుండగా, ఎం తేజస్విని నందమూరి సమర్పిస్తున్నారు. సంగీత సంచలనం ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. దసరా పండుగను పురస్కరించుకుని 25 సెప్టెంబర్, 2025లో చిత్రాన్ని విడుదల చేసేందుకు సినిమాను రెడీ చేస్తున్నారు.