కూటమి ప్రభుత్వంలో ఉన్న టీడీపీ పార్టీకి ఎప్పుడు వెయిట్ ఎక్కువే. ఆ పార్టీలోకి కొత్తగా వచ్చేవారు ఈమధ్యన కాస్త ఆలోచిస్తున్నారు. టీడీపీలో ఉన్న సీనియర్స్‌ని, బలంగా పాతుకుపోయిన నేతలను కాదని అధ్యక్షుడు కొత్తగా చేరేవాళ్లకు పదవులు కట్టబెట్టరు. కాబట్టే ఏపీలో ప్రస్తుతం రెండో అతిపెద్ద పార్టీగా ఉన్న జనసేనలోకి చేరితే కాస్తో కూస్తో భవిష్యత్తు ఉంటుందని అనుకోవడంతో పాటు, పవన్ కళ్యాణ్ రాజకీయం నచ్చి కొందరు జనసేనలో చేరిపోతున్నారు.
వైసీపీ పార్టీలో నుంచి వచ్చిన చాలామంది జనసేనలోకి వెళ్లారు. జనసేనలో ఫ్యూచర్ బావుంటుంది. 2029 ఎన్నికల సమయానికి తమకి తగిన గుర్తింపు వస్తుంది అనుకుని చాలామంది నేతలు జనసేనని చూజ్ చేసుకుంటున్నారు. ఇప్పటికే ఎమ్మెల్సీ, వైసీపీలోని కీలక నేతలు జనసేన బాట పడితే తాజాగా మరో వైసీపీ ఎమ్మెల్సీ జనసేన పార్టీలో జాయిన్ అవ్వబోతున్నాడనే వార్త వైసీపీ నోట్లపచ్చి వెలక్కాయ పడినట్లుగా చేసింది.
తూగో జిల్లాకు చెందిన తోట త్రిమూర్తులు చూపు జనసేనపై పడిందని అంటున్నారు. వైసీపీ ఓటమి తర్వాత తోట పార్టీకి అంటీముట్టనట్టు ఉన్నారు. తోట గనక జనసేనలో చేరితే జనసేన వెయిట్ మరింత పెరిగినట్లే అంటున్నారు. త్వరలోనే తోట త్రిమూర్తులు జనసేన తీర్థం పుచ్చుకోవడం ఖాయమని చెప్పుకుంటున్నారు.