మంత్రి పదవి వచ్చిన తర్వాత రోజా టీవీ షోలు, సినిమాలకు పూర్తిగా గుడ్‌బై చెబుతూ ఇక నుంచి ప్రజా సేవకే తన జీవితాన్ని అంకితం చేస్తున్నట్లు భావోద్వేగంగా ప్రకటించింది. దీంతో కొన్నాళ్ల పాటు ఆమె బుల్లితెరకు దూరంగా ఉండిపోయింది. అయితే ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆమె ఓటమిని చవిచూడడంతో పాటు ప్రభుత్వం మారిపోయింది. ఈ పరిణామాల నేపథ్యంలో రోజా రాజకీయాలపై తక్కువగా స్పందిస్తూ టీవీ షోలపైనే దృష్టి పెడుతోందని చెప్పొచ్చు.
తాజాగా రోజా జీ తెలుగు సూపర్ సీరియల్ ఛాంపియన్ షిప్ సీజన్ 4కి జడ్జిగా ఎంపికైంది. ఈ షోకు సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. అందులో రోజా మళ్లీ తన శైలి లో సందడి చేస్తోంది. ఈ షోలో రోజాతో పాటు శ్రీకాంత్ రాశి కూడా జడ్జిలుగా వ్యవహరించనున్నారు. మార్చి 2న ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి ఈ షో ప్రారంభం కానుంది. ప్రముఖ యాంకర్స్ రవి, అషురెడ్డి ఈ షోకు హోస్టింగ్ చేయనున్నారు. కొంతమంది అభిప్రాయంతో మరో నాలుగేళ్లు ఇదే ప్రభుత్వం కొనసాగుతుందని భావించి మళ్లీ ఎన్నికల వరకు టీవీ షోలతో బిజీగా ఉండాలనే ఉద్దేశంతో రోజా బుల్లితెరలోకి అడుగుపెట్టిందని అంటున్నారు.
మళ్లీ రోజా టీవీ షోలలో కనిపించడంతో ఆమె అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇది తాత్కాలికమా లేక పూర్తిగా టీవీ ఇండస్ట్రీలోనే కొనసాగుతుందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రోజా మళ్లీ జబర్దస్త్‌లోకి వస్తుందా లేకపోతే కొత్తగా మరెక్కడైనా ఎంట్రీ ఇస్తుందా అనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది.
ఇకపోతే జబర్దస్త్ షో విషయంలో నాగబాబు, రోజా ఇద్దరూ తప్పుకున్న తర్వాత ఇప్పటి వరకు ఎవరు కూడా పర్మనెంట్ జడ్జిలుగా కొనసాగలేదు. కొన్ని వారాల పాటు ఒక్కొక్క సెలబ్రిటీనే గెస్ట్ జడ్జిగా తీసుకువస్తున్నారు. ప్రస్తుతం నాగబాబు జనసేన పార్టీ కార్యకలాపాలతో బిజీగా ఉండటంతో అతను తిరిగి జబర్దస్త్‌లోకి వచ్చే అవకాశం లేదు. అయితే రోజా మళ్లీ బుల్లితెరపైకి రావడంతో జబర్దస్త్ టీమ్ ఆమెను తిరిగి తీసుకువస్తారా లేక కొత్తగా ఎవరినైనా ఫిక్స్ జడ్జిగా పెట్టాలనుకుంటున్నారా అనేది వేచి చూడాల్సిందే.