బాలీవుడ్‌లో అడపాదడపా అవకాశాలు వస్తున్నప్పటికీ వాటిని సద్వినియోగం చేసుకోవడంలో రకుల్ ప్రీత్ సింగ్‌కు అంతగా కలిసిరాలేదు. బాలీవుడ్‌లో హిట్ కొట్టి తిరిగి టాలీవుడ్‌లో భారీ ప్రాజెక్టులు చేజిక్కించుకోవాలని ఆమె ఆశపడుతున్నా వరుసగా వస్తున్న అవకాశాలు విజయాన్ని అందించలేకపోతున్నాయి. తాజాగా ఆమె నటించిన మరో సినిమా కూడా ఆశించిన స్థాయిలో ఆడలేదు.
అర్జున్ కపూర్ హీరోగా రకుల్ ప్రీత్ సింగ్ భూమి పెడ్నేకర్ ప్రధాన పాత్రల్లో నటించిన మేరే హస్బెండ్ కీ బివి చిత్రం నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమాపై ముందుగా పెద్దగా హైప్ లేకపోవడంతో విడుదల సమయంలోనూ మేకర్స్ బాగా ప్రమోట్ చేయలేదు. ఫలితంగా ప్రేక్షకుల్లో ఆసక్తి తగ్గిపోయింది. సినిమాకు భారీ ఓపెనింగ్స్ రావని ముందే అంచనా వేసిన చిత్ర బృందం కొన్ని థియేటర్లలో వన్ ప్లెస్ వన్ టికెట్ ఫ్రీ ఆఫర్ అందుబాటులోకి తీసుకువచ్చింది. కానీ ఈ ఆఫర్ కూడా ప్రేక్షకులను థియేటర్లకు రప్పించలేకపోయింది.
బాక్సాఫీస్ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా విడుదలైన మొదటి రోజే కేవలం రూ.2 కోట్ల వసూళ్లు మాత్రమే రాబట్టగలిగింది. శని ఆదివారాలు వీకెండ్ కావడంతో వసూళ్లు కొద్దిగా పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. కానీ ఎంత పెరిగినా సినిమా లాంగ్ రన్‌లో రూ.20 కోట్లకంటే ఎక్కువ వసూల్ చేసే అవకాశాలు లేదని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఈ సినిమా నిర్మాణానికి రూ.50 కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు సమాచారం. అయితే ప్రేక్షకుల స్పందనను చూస్తే సినిమా భారీ నష్టాలను మిగిల్చేలా ఉందని భావిస్తున్నారు. భారీ అంచనాల మధ్య తెరకెక్కిన ఈ చిత్రం ఈ స్థాయిలో ఫలితాన్ని అందుకోవడంతో రకుల్ కెరీర్‌పై మరింత ప్రభావం పడే అవకాశం ఉందని అంటున్నారు