సంక్రాంతికి విడుదల కావాల్సిన విశ్వంభర వాయిదా పడడంతో మెగాస్టార్ చిరంజీవి కొంత రిలాక్స్ మోడ్‌లోకి వెళ్లారు. కొత్త కథలు విని అంగీకరించడం, కొన్ని సినిమా ఈవెంట్లకు హాజరవడం మినహా పెద్దగా పనులేమీ చేయలేదు. కానీ ఇప్పుడు ఆయన మళ్లీ షూటింగ్ మోడ్‌లోకి వచ్చేశారు. విశ్వంభర ను త్వరగా పూర్తి చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన రెండు పాటలు మిగిలి ఉన్నాయి. ప్రస్తుతం ఓ పాటను చిత్రీకరిస్తుండగా మరో పాట ఈ నెలాఖరుకల్లా పూర్తవుతుంది. దీన్ని పూర్తి చేసిన తర్వాత మూవీ షూటింగ్ పూర్తయినట్లే.
ఇక మరోవైపు అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ కొత్త ప్రాజెక్ట్ గురించి చర్చలు సాగిస్తున్నాడు చిరు. ఇటీవల అనిల్ రావిపూడి కథను పూర్తిగా వినిపించగా చిరు అందులో మార్పులు చేర్పులపై చర్చిస్తున్నారు. ఈ ప్రక్రియ పూర్తయ్యాక అనిల్ పూర్తి స్థాయిలో స్క్రిప్ట్ వర్క్ ప్రారంభించనున్నాడు. ఇదే కాకుండా మరో కొత్త ప్రాజెక్టును కూడా సమాంతరంగా మొదలుపెట్టాలనే ఆలోచనలో ఉన్నారు. ఇప్పటికే ఓ ఇద్దరు దర్శకుల కథలు విని ఎంపిక కూడా చేసుకున్నారు కానీ తుది నిర్ణయం తీసుకోవడం ఇంకా మిగిలి ఉంది.
చిరంజీవి ప్రస్తుతం ఏ కథను ఎంచుకోవాలి ? అనే ఆలోచనలో ఉన్నారు. మరిన్ని కథలు వింటారా లేక ఇప్పటికే విన్న కథల్లోనే ఒకటిని సెలెక్ట్ చేసుకుంటారా అనే విషయమై ఆలోచనలో ఉన్నారు. ఇదిలా ఉండగా విశ్వంభర రిలీజ్ డేట్ ఖరారు చేయాల్సి ఉంది. సినిమా పూర్తయినందున పోటీ లేకుండా సరైన సాలిడ్ డేట్‌ను ఫిక్స్ చేసేందుకు యూవీ క్రియేషన్స్ నిర్మాతలతో చిరు చర్చలు జరుపుతున్నారు. త్వరలోనే ఈ మూవీ విడుదలపై అధికారిక ప్రకటన రానుంది.