కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ ప్రధాన పాత్రలో నటించిన యాక్షన్ థ్రిల్లర్ మ్యాక్స్ గురించి సినీ ప్రియులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విజయ్ కార్తీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం 2025 డిసెంబర్ 25న క్రిస్మస్ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వీ క్రియేషన్స్ కిచ్చా క్రియేషన్స్ బ్యానర్లపై కలైపులి ఎస్ థాను కిచ్చా సుదీప్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలైంది.
ఈ చిత్రంలో వరలక్ష్మీ శరత్‌కుమార్, సునీల్ ఇళవరసు ఆడుకాలం నరేన్, ప్రమోద్ శెట్టి, కరణ్ ఆర్య కీలకపాత్రల్లో నటించారు. టీజర్, ట్రైలర్, ఫస్ట్‌లుక్ పోస్టర్లతో సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయింది. చిత్ర నిర్మాణ వ్యయంతో పాటు, నటీనటుల పారితోషికం, ప్రమోషనల్ ఖర్చులను కలిపి మొత్తం బడ్జెట్ దాదాపు రూ. 65 కోట్లుగా ఉందని సమాచారం. ప్రీ రిలీజ్ సమయంలోనే భారీ బిజినెస్ సాధించిన ఈ చిత్రం జీ కన్నడకు శాటిలైట్ హక్కులను రూ. 28 కోట్లకు విక్రయించడం గమనార్హం.
డిసెంబర్ 25న తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందనను అందుకుంది. నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్, మంత్రుల కుమారుల హత్యలు, పోలీస్ స్టేషన్‌పై దాడి జరిగిన ఘటనల నేపథ్యంలో కథ నడుస్తుంది. హీరో ఈ ప్రమాదకర పరిస్థితులను ఎలా ఎదుర్కొన్నాడు..? అసలు ఈ హత్యల వెనుక ఉన్న రహస్యమేంటి..? అనే ప్రశ్నలకు సమాధానం ఈ చిత్ర కథలో ఉంది.
సుదీప్ నటన యాక్షన్ సీక్వెన్స్‌లు థమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు హైలైట్‌గా నిలిచాయి. విడుదలైన మొదటి రోజే బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించిన ఈ చిత్రం థియేట్రికల్ రన్ ముగిసేసరికి రూ. 60 కోట్లకుపైగా గ్రాస్ కలెక్షన్ రాబట్టింది. థియేటర్లలో సందడి చేసిన మ్యాక్స్, ఇప్పుడు ఓటీటీలో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉంది.
కిచ్చా సుదీప్ అభిమానులు ఈ సినిమాను ఓటీటీలో ఎప్పుడెప్పుడు చూడబోతామా..? అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ నెటిజన్ ప్రశ్నకు స్పందించిన జీ 5 ఓటీటీ సంస్థ, ఫిబ్రవరి 22 నుంచి మ్యాక్స్‌ను స్ట్రీమింగ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ వార్తతో అభిమానుల్లో సందడి మొదలైంది. మరో 14 రోజుల్లో ఈ సినిమా ఓటీటీలో అందుబాటులోకి రానుండటంతో అభిమానులు సోషల్ మీడియాలో పోస్టర్లు, సుదీప్ లుక్స్‌ను షేర్ చేస్తూ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.