ప్రస్తుతం సినీ పరిశ్రమలో నెలకొన్న సంక్షోభాన్ని అదుపులోకి తీసుకురావాలంటే షూటింగ్‌లను నిలిపివేయడమే కాకుండా సినిమాల విడుదల, ఇతర సినీ సంబంధిత కార్యకలాపాలను కూడా తాత్కాలికంగా నిలిపివేయాల్సిన అవసరం ఉందని పరిశ్రమ ప్రముఖులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో నిర్మాతల మండలి, పంపిణీదారుల సంఘం, చిత్ర కార్మిక సంఘం, ఎగ్జిబిటర్ అసోసియేషన్ కలిసి ఈ కఠిన నిర్ణయాన్ని తీసుకున్నాయని ప్రముఖ నిర్మాత సురేష్ కుమార్ తెలిపారు.
సినీ పరిశ్రమ ఇప్పటికే 30 శాతం పన్నును చెల్లిస్తోందని దీనికితోడు వినోద పన్ను అదనంగా ఉండటంతో సినిమా నిర్మాణ వ్యయం పెరిగిపోయిందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ జోక్యం అవసరం పన్నుల భారం తగ్గించాల్సిన అవసరం ఉందని వారు అభిప్రాయపడుతున్నారు.
ఇటీవల కొత్తగా ఎంట్రీ ఇస్తున్న నటీనటులు, దర్శకులు ఎంతో ఎక్కువ పారితోషికాన్ని డిమాండ్ చేస్తున్నారని దీంతో సినిమా బడ్జెట్‌లో 60 శాతం వరకు నటి నటుల రేమ్యునరేషన్‌కే వెళ్తోందని నిర్మాతలు వాపోతున్నారు. దీని వల్ల నిర్మాతలు భారీ ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని పారితోషిక నియంత్రణ లేనిదే పరిశ్రమ స్థిరంగా ఉండలేదని సురేష్ కుమార్ స్పష్టం చేశారు.
గత ఏడాది మొత్తం 176 సినిమాలు విడుదల కాగా అవి ఊహించని నష్టాలను మిగిల్చాయని దాదాపు 100 కోట్లకు పైగా నష్టం నమోదైనట్లు పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి. ఈ నష్టాలు చిన్న నిర్మాతలు, కార్మికులు, డిస్ట్రిబ్యూటర్లు వంటి పరిశ్రమపై ఆధారపడిన లక్షలాది మంది జీవనోపాధిని ప్రభావితం చేస్తున్నాయి.
పరిస్థితులను అదుపులోకి తెచ్చేందుకు చిత్ర నిర్మాణ వ్యయాలను తగ్గించేందుకు పరిశ్రమలో ఉన్న కీలక సంఘాలు సినిమా పనులన్నీ తాత్కాలికంగా నిలిపివేయాలని నిర్ణయించాయి. ముఖ్యంగా అధిక పారితోషికం తీసుకునే నటీనటులు, టెక్నీషియన్లు తాము రెమ్యూనరేషన్ తగ్గించుకోకపోతే పరిశ్రమ మరింత కష్టాల్లో పడుతుందని వర్గాలు చెబుతున్నాయి. మొత్తానికి సినీ పరిశ్రమలో సమతుల్యత సాధించేందుకు నష్టాలను తగ్గించేందుకు త్వరలో కొన్ని కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయనేది స్పష్టమవుతోంది.