మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ వేదికగా ఓ సంతోషకరమైన విషయాన్ని షేర్ చేసుకున్నారు. రాజకీయాలకు నేను దూరమయ్యానేమో కానీ, రాజకీయాలు మాత్రం నాకు దూరం కాలేదు అంటూ ఇటీవల చిరంజీవి ఓ సందర్భంలో చెప్పినట్లుగా.. ఒకవైపు సినిమాలు చేస్తూనే, మరోవైపు రాజకీయ కార్యక్రమాలలో చిరు బిజీగా ఉంటున్నారు.
సంక్రాంతి టైమ్‌లో కిషన్ రెడ్డి ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధాని మోదీతో పాటు పాల్గొన్న చిరు.. మరోసారి మోదీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన వేవ్స్ బోర్డులో భాగమయ్యారు. ఈ విషయాన్ని స్వయంగా మోదీ చెబుతున్న వీడియోని షేర్ చేసి, చిరు తన ఆనందాన్ని పంచుకున్నారు. ప్రస్తుతం చిరు షేర్ చేసిన ఈ వీడియో వైరల్ అవుతోంది.
వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ సమ్మిట్ (వేవ్స్) కోసం నిర్వహించిన అడ్వైజరీ బోర్డ్‌లో భాగం కావడం, అలాగే ఇతర సభ్యులతో కలిసి నా ఆలోచనలను షేర్ చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ప్రధాని నరేంద్ర మోదీ ఆలోచనలు భారతదేశాన్ని ముందుకు నడిపిస్తాయనడంలో నాకు ఎటువంటి సందేహం లేదు అంటూ చిరంజీవి తన పోస్ట్‌లో పేర్కొన్నారు. భారత్‌ను గ్లోబల్ ఎంటర్‌టైన్‌మెంట్ హబ్‌గా మార్చే క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది చివరిలో వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ సమ్మిట్‌ను నిర్వహించనుంది.