డోనాల్డ్ ట్రంప్ ఎప్పుడైతే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలిచాడో అప్పుడే ఇతర దేశాల వాళ్ళ గుండెల్లో రాయి పడింది. ట్రంప్ స్థానికత అనే బలమైన ఆయుధం మీద గెలిచిన అధ్యక్షుడు. ఇతర దేశాల వారి వల్ల తన దేశంలో వారు ఎలాంటి ఇబ్బంది పడకూడదనే నినాదంతో అమెరికాకు అధ్యక్షుడు అయ్యాడు ట్రంప్. అలా అధ్యక్షుడిగా ప్రమాణ శ్వీకారం చేసాడో, లేదో.. ఇలా ఇతర దేశాల వారికి అమెరికాలో పిల్లలు పుడితే వారికి అమెరికా పౌరసత్వం చెల్లదు అనే బిల్లు తీసుకొచ్చాడు. ఆ వ్యవహారం కోర్టుకు వెళ్ళింది.
ఈలోపులో ట్రంప్ అక్రమ వలసదారుల విషయంలో కఠినమైన నిర్ణయాన్ని తీసుకున్నాడు. అమెరికాలో అక్రమంగా 7.25 లక్షల మంది భారతీయులు నివసిస్తున్నారు, అక్రమ వలసదారులందరిని వెనక్కి తీసుకొస్తామని భారత్ ప్రకటించింది. అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్న ట్రంప్ వివిధ దేశాలకు చెందిన వారిని బహిష్కరిస్తున్నారు. అమెరికా చరిత్రలోనే అతిపెద్ద బహిష్కరణ ఆపరేషన్ కొనసాగుతోంది. దేశంలో అక్రమంగా ఉంటున్న వారిని గుర్తించి అమెరికా అధికారులు వారిని ఆయా దేశాలకు తరలిస్తున్నారు.
అందులో భాగంగా భారత్‌కు ఓ విమానం బయలుదేరింది. సీ17 విమానంలో వీరిని తరలిస్తున్నట్టు సమాచారం. అమెరికాలో భారత్‌కు చెందిన దాదాపు 7.25 లక్షల మంది సరైన ధ్రువీకరణ పత్రాలు లేకుండా ఉంటున్నట్టు సమాచారం. వీరిలో 18 వేల మందిని భారత్‌కు తరలించేందుకు జాబితా రూపొందించింది. వీసా గడువు ముగిసినా సరైన పత్రాలు లేకుండా అమెరికా సహా ఎక్కడ ఉన్నా భారతీయులను వెనక్కి తీసుకొస్తామని తెలిపింది.
భారత్‌కు చెందిన అక్రమ వలసదారులతో కూడిన విమానం అమెరికా నుంచి బయలుదేరింది. మరికొన్ని గంటల్లో ఇది భారత్ చేరుకునే అవకాశం ఉంది.